Site icon NTV Telugu

Dil Raju: తిరుమల శ్రీవారి కోసం ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయ ధాన్యం!

Dil Raju

Dil Raju

ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజుకు తిరుమల వేంకటేశ్వర స్వామి అంటే అపార నమ్మకం. అందుకే తన స్వగ్రామంలో ఆయన వేంకటేశ్వరస్వామి కోవెలను నిర్మించారు. అలానే తాను నిర్మించిన ప్రతి చిత్రం విడుదల కాగానే తిరుమల వెళ్ళి తలనీలాలు సమర్పించి, స్వామిని దర్శించుకుని రావడమన్నది ‘దిల్’ రాజు కు కొన్నేళ్ళుగా ఉన్న అలవాటు. తాజాగా ఆయన అన్న నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం కూడా మొదలు పెట్టారు. ఇలా ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ధాన్యాన్ని ‘మా పల్లె ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం ఆరగింపు సేవ కోసం అందిస్తున్నారు.

దీనికి సంబంధించిన వివరాలను ‘దిల్’ రాజు శనివారం మీడియాకు వివరించారు. ‘ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పదకొండు రకాల వరి ధాన్యం నుంచి పంచభక్ష్యాలుగా, నారాయణ కామిని, కృష్ణ వ్రీహి, బహురూపి, రత్న చోడి, ఘని అనే ఐదు రకాల ధాన్యాన్ని తిరుమలకు పంపుతున్నామ’ని దిల్ రాజు తెలిపారు. ‘ఇందులో భాగస్వాములు కావాలనుకున్న కొందరు స్వామి భక్తులు పది కేజీల చొప్పన ధాన్యం తీసుకుని వారి ఇంటిలోని పూజా గదిలో స్వామి చెంత ఉంచి మే 1న తిరిగి ఇందురూ తిరుమల దేవస్థానంలో సమర్పించాల’ని అన్నారు. అలా సేకరించిన మొత్తం ధాన్యాన్ని మే1న స్వామి నామ సంకీర్తనతో మేళతాళాలతో, ఊరేగింపుతో ప్రత్యేక వాహనంలో తిరుమలకు పంపుతామని వివరించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని మా పల్లె ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయ బృందం నిర్వహిస్తోందని తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దిల్ రాజు సోదరుడు నరసింహారెడ్డి, శిరీష్ తో పాటు దర్శకులు అనిల్ రావిపూడి, వేణు శ్రీరామ్, హరీశ్‌ శంకర్, వంశీ పైడిపల్లి, ఇంద్రగంటి మోహన కృష్ణ, ‘మ్యాంగో’ రామ్, హీరో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version