Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..

Harshith Reddy

Harshith Reddy

Harshith Reddy: ‘శుభం’, ‘దివానా’ చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో హర్షిత్ రెడ్డి.. త్వరలోనే ‘రోమియో జూలియట్’ అనే డిఫరెంట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ‘సారీ బేబీ’ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ స్టేజ్ మీద హర్షిత్ మాట్లాడుతూ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తమ చిన్న సినిమాకు చేసిన సపోర్ట్ గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. సినిమా స్టోరీ రివీల్ వీడియోకు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ రావడంపై స్పందిస్తూ డార్లింగ్ ప్రభాస్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పాడు హర్షిత్. “నేను గతంలో ప్రభాస్ అన్నతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అన్నతో కలిసి నటించాననే ఆ ఒక్క చొరవతోనే ధైర్యం చేసి మా సినిమా గురించి సపోర్ట్ చేయమని అడిగాను. అంతే.. అన్న ఏమాత్రం ఆలోచించకుండా తన సొంత ఇన్‌స్టాగ్రామ్‌లో మా స్టోరీ రివీల్ వీడియోను పోస్ట్ చేసి మొత్తం టీమ్‌కు కొండంత అండగా నిలిచారు. అది మాకు చాలా పెద్ద విషయం” అంటూ హర్షిత్ మనసులోని మాటను బయటపెట్టాడు.

ఇక ఈవెంట్‌లో తన పర్సనల్ లైఫ్‌పై కూడా హర్షిత్ అదిరిపోయే పంచ్ వేశాడు. “రిలేషన్షిప్స్ గురించి వీడియోలో బాగా చెప్పారు కదా.. రియల్ లైఫ్‌లో మీరెన్ని షిప్పులు ఎక్కి దిగారు?” అని యాంకర్ అడగ్గానే.. “నాది టైటానిక్ షిప్ అండి.. ఎప్పుడో మునిగిపోయింది” అంటూ నవ్వుతూ తన బ్రేకప్‌పై ఓపెన్ అయ్యాడు. కానీ నవంబర్ 13న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా షిప్ మాత్రం సేఫ్‌గా ఒడ్డుకు చేరుతుందని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. అసలు తాను ఇండస్ట్రీకి సింగర్ అవుదామని వచ్చి అనుకోకుండా యాక్టర్ అయ్యానని గుర్తుచేసుకున్నాడు. సినిమా కాన్సెప్ట్ గురించి చెబుతూ.. సాధారణంగా రోమియో జూలియట్ అంటే అంతా క్యూట్ లవ్ స్టోరీ అనుకుంటారని, కానీ మా సినిమాలో రోమియో జూలియట్‌ను చంపడానికి తిరుగుతుంటాడని క్రేజీ ట్విస్ట్ ఇచ్చాడు. డైరెక్టర్ భార్గవ్ ఈ తరం బంధాలను ఎలాంటి ఫిల్టర్ లేకుండా చాలా వైల్డ్‌గా చూపించారని.. ప్రేమ వల్ల ఒక సైలెంట్ మనిషి ఎంత వైలెంట్‌గా మారుతాడనేది సినిమాలో భలే చూపించారని అన్నాడు. ఈటీవీ విన్ సమర్పిస్తున్న ఈ బోల్డ్ ఎంటర్‌టైనర్ నవంబర్ 13న థియేటర్లలో రిలీజ్ కానుంది.