హైదరాబాద్‌లోని లులు మాల్ వేదికగా జరిగిన ‘ది రాజా సాబ్’ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రభాస్ వంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న హీరో సినిమా కార్యక్రమం కావడం వల్ల దేశవ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది. అయితే, ఈ వేడుక ముగిసిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాక, జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. కార్యక్రమం ముగించుకుని హీరోయిన్ నిధి అగర్వాల్ తన కారు వైపు వెళ్తున్న సమయంలో, అక్కడ ఉన్న కొంతమంది యువకులు అత్యుత్సాహంతో ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమె కారు ఎక్కేలోపు కొందరు ఆమెను తాకడానికి ప్రయత్నించడం, చుట్టుముట్టడం వంటి చేష్టలు కెమెరాలకు చిక్కాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపిస్తున్నాయి. నిధి అగర్వాల్ తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు ఆ వీడియోలలో స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read :AKhanda 2: రియల్ అఘోరాలలతో బాలయ్య భేటీ?
ఈ ఘటన కేవలం ఒక చిన్న గొడవగా మిగిలిపోలేదు. ప్రభాస్ సినిమా కావడంతో జాతీయ మీడియా కూడా ఈ ఈవెంట్‌ను కవర్ చేసింది. ఇప్పుడు ఈ అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు చూసి దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ముక్కున వేలేసుకుంటున్నారు. “ఒక అతిథిగా వచ్చిన నటి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది? ఇలాంటి పనులతో తెలుగు వారి సంస్కృతిని, పరువును గంగలో కలుపుతున్నారా?” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంత పెద్ద మాల్‌లో, వేలాది మంది వచ్చే అవకాశం ఉన్నప్పుడు నిర్వాహకులు సరైన భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పబ్లిక్ ఈవెంట్లకు వచ్చే సెలబ్రిటీ మహిళలకే రక్షణ లేకపోతే, సామాన్య మహిళల పరిస్థితి ఏమిటి? అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read :Sitara – Akhanda 2 : అఖండ2లో పాత్ర కోసం సితార మొదలు సూర్య కూతురి దాకా?
తెలుగు సినిమా (టాలీవుడ్) ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో రాణిస్తోంది. ప్రభాస్ వంటి హీరోలు ఇండియన్ సినిమా రేంజ్‌ను పెంచుతున్నారు. ఇలాంటి తరుణంలో ఒక హీరోయిన్‌తో కొంతమంది ఆకతాయిలు చేసిన ఈ పని ఇండస్ట్రీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉంది. “హీరోయిన్లను కేవలం గ్లామర్ బొమ్మలుగా చూడటం మానేసి, తోటి మనిషిగా గౌరవించడం ఎప్పుడు నేర్చుకుంటారు?” అంటూ మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? లులు మాల్ యాజమాన్యం మరియు ఈవెంట్ నిర్వాహకులు దీనిపై ఎలా స్పందిస్తారు? అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, ఈ ఘటన ఎంటర్ టైన్మెంట్ ఫీల్డ్ లో ఉండాల్సిన కనీస నైతికతపై మరోసారి పెద్ద చర్చకు తెరలేపింది.
