సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సవాలాత్మక పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్, బ్లాక్‌బస్టర్ చిత్రాలతో స్టార్ స్థాయికి చేరుకుంది. ఆమె తాజాగా తెలుగులో ‘పోలీస్ కంప్లెయింట్’ అనే సినిమా చేస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో వరలక్ష్మి శక్తివంతమైన పాత్రతో పాటు, తొలిసారి పూర్తిగా వినోదాత్మకమైన రోల్‌లో కనిపించనుంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణపై ఒక ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించామని, అది సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాతలు ఈ సందర్భంగా తెలిపారు.
Also Read: Ashanya: మోడీని కలిసిన పహల్గామ్ బాధితురాలు.. ప్రధాని ఏం హామీ ఇచ్చారంటే..!
ఈ చిత్రాన్ని ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్, శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా సంస్థల సంయుక్త బ్యానర్‌లపై సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ నిర్మిస్తుండగా, అఘోర (తెలుగు, తమిళం), ఆప్త, పౌరుషం, రాఘవ రెడ్డి, ఆదిపర్వం వంటి విభిన్న చిత్రాలను రూపొందించిన దర్శకుడు సంజీవ్ మేగోటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, అమిత్, దిల్ రమేష్, రాజశ్రీ నాయర్, సింగపూర్ బాలకృష్ణ, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీహర్ష తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, “సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాం. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మనం చేసే ప్రతి చర్యకు ఫలితం తిరిగి మనకే వస్తుందనే ఆలోచనతో, హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది,” అని తెలిపారు.
