Site icon NTV Telugu

Pawan Kalyan: ‘సూపర్ స్టార్ రజినీ’ టైటిల్ కార్డ్ కనిపిస్తే థియేటర్ మారుమోగుతుంది!

Pwan Kalyan

Pwan Kalyan

స్వర్ణోత్సవ సూపర్ స్టార్ రజినీకాంత్‌కి శుభాకాంక్షలు అంటూ పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రజనీ కాంత్ నటించిన మొదటి సినిమా రిలీజ్ అయి 50 ఏళ్లు పూర్తి అయిన క్రమంలో ఆయనకు శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాటలు యధాతథంగా “వెండి తెరపై ‘సూపర్ స్టార్ రజినీ’ అని టైటిల్ కనిపించగానే థియేటర్ ఏ విధంగా మారుమోగుతుందో పలుమార్లు చెన్నైలో చూశాను. తరాలు మారుతున్నా సినీ ప్రియుల్లో ఆ ఆనందోత్సాహాల వన్నె తగ్గలేదు. ఆ స్థాయి అభిమానులను దక్కించుకున్న అగ్రశ్రేణి కథానాయకుడు రజినీకాంత్ నటుడిగా ఐదు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. సినీ జీవితంలో స్వర్ణోత్సవం చేసుకుంటున్న సూపర్ స్టార్ రజినీకాంత్‌కి హృదయపూర్వక శుభాకాంక్షలు. నటుడిగా ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.

Also Read:Coolie vs War 2: రెండో రోజు సీన్ రివర్స్.. మండే నుంచి అసలు సిసలైన పరీక్ష!

ప్రతినాయక పాత్ర పోషించినా, కథానాయకుడిగా మెప్పించినా రజినీకాంత్ తనదైన స్టైల్‌ను చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఆయన నడకలో, సంభాషణలు పలకడంలో, హావభావ విన్యాసంలో ప్రత్యేకతను చూపిస్తారు. రజినీకాంత్ స్టైల్స్‌కి నవతరం ప్రేక్షకుల్లోనూ అభిమానులున్నారు. నటుడిగా శిఖరాగ్ర స్థాయికి చేరిన రజినీకాంత్ మహావతార్ బాబాజీ భక్తుడిగా ఆధ్యాత్మిక విషయాలపై, యోగా సాధనపై ప్రత్యేక శ్రద్ధ చూపడం ఆయనలో భక్తి భావాన్ని, ధార్మిక విశ్వాసాలను తెలియజేస్తుంది. నటుడిగా స్వర్ణోత్సవ సంబరాలు చేసుకుంటున్న రజినీకాంత్ మరిన్ని విభిన్న పాత్రలతో సినీ ప్రియులను మెప్పించాలని ఆకాంక్షిస్తున్నాను. రజినీకాంత్‌కి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Exit mobile version