Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘బాలు’ చిత్రంలో ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్, ముఖ్యంగా ఆ కార్గో ప్యాంటు అప్పట్లో యూత్‌ను ఎంతగా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ స్టైల్ గురించి సినీ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి, కాస్ట్యూమ్ డిజైనర్ రేణు దేశాయ్ ఆ ఐకానిక్ ప్యాంటుకు సంబంధించిన మైండ్ బ్లోయింగ్ నిజాలను బయటపెట్టారు.
ఆ కాలంలోనే ఒక్క ప్యాంటు ఖరీదు ఏకంగా రూ. 75,000 అని ఆమె వెల్లడించడంతో యాంకర్ సహా నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఆ ప్యాంటు వెనుక ఉన్న చరిత్ర, దానికోసం పడ్డ శ్రమ సాధారణమైనది కాదని రేణు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటలీలోని మిలన్లో దొరికిన ఆ ప్యాంటును ‘రెండో ప్రపంచ యుద్ధం’ నాటి ఒరిజినల్ ఆర్మీ క్లాత్‌తో ప్రత్యేకంగా తయారు చేశారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అలాంటి ప్యాంట్లు కేవలం 5 మాత్రమే తయారు చేస్తే, అందులో ఒకదాన్ని స్టార్ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హామ్ కొనుగోలు చేయగా.. మరొకదాన్ని పవన్ కళ్యాణ్ కోసం తాను ఎంతో శ్రమించి తీసుకొచ్చానని రేణు దేశాయ్ తెలిపారు. ముందుగానే అడ్వాన్స్ చెల్లించి, ఏకంగా 3 నెలల పాటు వెయిట్ చేసిన తర్వాత ఆ ప్యాంటును డెలివరీ తీసుకున్నట్లు చెప్పారు.
ఒక్క ప్యాంటు కోసం అప్పట్లోనే రూ. 75 వేలు ఖర్చు చేయడానికి నిర్మాతను ఎలా ఒప్పించారనే ఆసక్తికర విషయాన్ని కూడా ఆమె పంచుకున్నారు. సినిమాలో పవన్ ఎక్కువ శాతం అదే ప్యాంటుతో కనిపించే కంటిన్యూటీ ఉంటుందని.. ఐదు వేల రూపాయల చొప్పున పది ప్యాంట్లు కొనే బదులు, మరో పాతిక వేలు అదనంగా పెట్టి ఇలాంటి అరుదైన ప్యాంటును కొంటే తెరపై ఎంతో రిచ్‌గా, ప్రత్యేకంగా కనిపిస్తుందని నిర్మాతను ఒప్పించినట్లు వివరించారు. ఆ రోజు అలా ఒప్పించబట్టే దాదాపు పాతికేళ్ల తర్వాత కూడా ఆ కాస్ట్యూమ్ గురించే మాట్లాడుకుంటున్నామని ఆమె చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ స్టైల్ కోసం అప్పట్లోనే చేసిన ఈ భారీ ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

