Legendary Singer Biopic: ఆ లెజెండరీ సింగర్ కథతో రెహమాన్ సినిమా.. నిజమేనా?

Legendary Singer Biopic

Legendary Singer Biopic

Legendary Singer Biopic: భారతీయ సినీ సంగీతంలో తరాలు మారినా చెక్కుచెదరని మధుర స్వరం గాన కోకిల పి.సుశీలమ్మ సొంతం. వేలాది పాటలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ఈ దిగ్గజ గాయని జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమవుతోందంటూ సినీ వర్గాల్లో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న పేర్లు చూస్తుంటే ఇది నిజమేనా అనే ఆశ్చర్యం కలగక మానదు. ఈ వార్తలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న ప్రధాన అంశం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పేరు. సుశీలమ్మ బయోపిక్‌ను రెహమాన్ స్వయంగా నిర్మించనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. సాధారణంగా బయోపిక్‌లు వేరు, ఒక లెజెండరీ గాయని జీవితాన్ని సంగీత మాంత్రికుడే స్వయంగా తెరకెక్కించడం వేరు.

అలాంటి గొప్ప గాయని కథను ఆస్కార్ విజేత సినిమాగా మలచనున్నారనే టాక్ రావడంతో, ఇప్పుడు నిజంగానే రెహమాన్ దీనికి శ్రీకారం చుడుతున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సుశీలమ్మ పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై కూడా ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది. దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి రుక్మిణి వసంత్‌ను ఈ పాత్ర కోసం ఎంపిక చేశారనే ప్రచారం జోరందుకుంది. సుశీలమ్మ ఆహార్యం, అమాయకత్వంతో కూడిన సహజమైన రూపాన్ని తెరపై పండించేందుకు ఆమె సరైన ఛాయిస్ అని మేకర్స్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్, కాస్టింగ్ వివరాలపై ఇప్పటివరకు రెహమాన్ టీమ్ నుంచి గానీ, సుశీలమ్మ కుటుంబం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మేకర్స్ నుంచి స్పష్టత వస్తే తప్ప, ఈ లెజెండరీ సంగీత ప్రయాణం ఎప్పుడు పట్టాలెక్కుతుందో కచ్చితంగా చెప్పలేం.