మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల నిర్మించిన తాజా చిత్రం ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. గత వారం విడుదలైన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. దాంతో డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి ఈరోజు ఘనంగా సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘మా సినిమాను చూసి ఆదరించిన ప్రేక్షకులకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పడం అసాధ్యం. కానీ మీ ప్రేమకు నేను రుణపడి ఉంటాను. సినిమాను నమ్మి కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లందరూ ఈ రోజు హ్యాపీగా ఉన్నారు. అదే నా నిజమైన విజయం. భవిష్యత్తులో నేను చేసే ప్రతి సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు ఇలాగే సంతోషంగా ఉండేలా చూసుకుంటాను’ అని ఆమె పేర్కొన్నారు. పరిశ్రమలో తనకు అండగా నిలిచిన వారిని ఈ సందర్భంగా నిహారిక గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా మైత్రి రవి గారి గైడెన్స్, స్ట్రైక్ సమయంలో సపోర్ట్ చేసిన సుప్రియ, స్వప్న దత్ సహాయాన్ని కొనియాడారు. సినిమా ఇంతటి విజయం సాధించడంలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పిల్లర్ అయిన రమేష్ గారి పాత్ర ఎంతో ఉందని ఆమె తెలిపారు.
సినిమా విజయంలో భాగస్వాములైన సంగీత్ శోభన్, నయన్ సారిక, గెటప్ శ్రీనుల నటనను నిహారిక అభినందించారు. ప్రమోషన్స్ విషయంలో ఎవరూ ఎటువంటి షరతులు విధించకుండా పూర్తి స్థాయిలో సహకరించడం వల్లే ‘రాకాస’ ప్రేక్షకులకు అంత దగ్గరైందని ఆమె అన్నారు. దర్శకురాలు మానస శర్మ ఈ చిత్రాన్ని సమ్మర్లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. సక్సెస్ మీట్లో నిహారిక ఒక కీలక ప్రకటన చేశారు. రాకాసను మరింత మంది ప్రేక్షకులకు చూడాలనే ఉద్దేశంతో.. నేటి నుంచి సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధరను కేవలం రూ.100 కే అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ థియేటర్లకు వచ్చి ఈ ఎంటర్టైనర్‌ను ఎంజాయ్ చేయాలని నిహారిక కోరారు.
