Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!

Neha Sharma

Neha Sharma

సాంకేతికత పెరిగే కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ముఖ్యంగా సినీ తారలను టార్గెట్ చేస్తూ పుట్టుకొస్తున్న ‘డీప్‌ఫేక్’ వీడియోలు ఇండస్ట్రీని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఏఐ టెక్నాలజీని అడ్డం పెట్టుకుని కొందరు ఆకతాయిలు హీరోయిన్ల ముఖాలతో అసభ్యకరమైన వీడియోలు సృష్టిస్తున్నారు. తాజాగా ఈ డీప్‌ఫేక్ మాయాజాలానికి టాలీవుడ్ ‘చిరుత’ బ్యూటీ, బాలీవుడ్ నటి నేహా శర్మ బలయ్యారు. అయితే దీనిపై సైలెంట్ గా బాధపడకుండా, నేహా శర్మ రౌద్రరూపం దాల్చారు. తన వీడియోలు సృష్టిస్తున్న సైబర్ నేరగాళ్ల భరతం పడతానంటూ నెట్టింట సంచలన పోస్ట్ పెట్టారు.
తన అనుమతి లేకుండా తన ముఖాన్ని ఉపయోగించి ఏఐ ద్వారా వీడియోలు, ఫోటోలు సృష్టిస్తున్న వారిపై నేహా శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నా ఫేస్ వాడి క్రియేట్ చేసిన ఫేక్ కంటెంట్ మొత్తాన్ని వెంటనే డిలీట్ చేయండి. నా పరువుకు భంగం కలిగించేలా ఇలాంటి వీడియోలు సృష్టించడం, వాటిని సర్క్యులేట్ చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనికి నా సమ్మతి అస్సలు లేదు. తక్షణమే ఆ చెత్తనంతా నెట్టింటి నుంచి తొలగించండి.. ఇదొక ఫార్మల్ వార్నింగ్” అంటూ నేహా శర్మ గట్టిగా హెచ్చరించారు.

“ఫేక్ అకౌంట్ల వెనుక దాక్కున్నా సరే చట్టం నుంచి, శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నా ఐడెంటిటీని వాడుకుని ఇలాంటి ఏఐ వీడియోలు క్రియేట్ చేసినా, ఎడిట్ చేసినా, లేదా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసినా సరే.. ప్రతి ఒక్కరిపైనా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఏఐ టెక్నాలజీ, ఫేక్ అకౌంట్లు మిమ్మల్ని కాపాడతాయని భ్రమపడకండి. పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. టేక్ ఇట్ డౌన్ నౌ.. యు హావ్ బీన్ వార్న్డ్ (వెంటనే ఆ వీడియోలు తీసేయండి.. మిమ్మల్ని హెచ్చరించడం జరిగింది)” అంటూ ఘాటైన పోస్ట్‌తో అల్టిమేటమ్ జారీ చేశారు.