NBK111: ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK111 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరూ మరోసారి చేతులు కలపడంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. బాలయ్య బర్త్‌డే సందర్భంగా విడుదలైన గ్లిమ్స్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లోని కొన్ని సన్నివేశాలకు శుక్రవారం నుంచి బాలకృష్ణ డబ్బింగ్ చెప్పనున్నట్లు సమాచారం. అలాగే అక్టోబర్ 5 నుంచి మైసూరులో కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముంబై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ కథతో ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ సమయంలో బాలకృష్ణకు గాయం కావడంతో కొంతకాలం చిత్రీకరణకు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆయన తిరిగి షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు టైటిల్ విషయంలోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మేకర్స్ ప్రస్తుతం ‘GOD’, ‘DADA’ అనే రెండు పవర్‌ఫుల్ మాస్ టైటిల్స్‌ను ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం. బాలయ్య ఇమేజ్‌కు, కథకు ‘GOD’ టైటిల్ మరింతగా సరిపోతుందని చిత్రబృందం భావిస్తున్నట్లు టాక్. దీంతో దాదాపు ఈ చిత్రానికి ‘GOD’ అనే టైటిల్‌నే ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసి డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే టైటిల్‌పై అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

