నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఫుల్ పీక్స్ లో ఉన్నారు. జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య తన తదుపరి చిత్రాలను కూడా లైన్‌లో పెడుతున్నారు. ఇందులో భాగంగా ‘బ్రోచేవారెవరురా’, ‘సరిపోదా శనివారం’ వంటి విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో బాలకృష్ణ ఒక భారీ ప్రాజెక్టు చేయబోతున్నారు. ఈ క్రేజీ కాంబోపై టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి.
బాలయ్య బాడీ లాంగ్వేజ్ మరియు ఇమేజ్‌కు తగ్గట్టుగా వివేక్ ఆత్రేయ ఒక పవర్‌ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేసాడట. ఈ కథలో బాలయ్య ద్విపాత్రాభినయం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అయితే వివేక్ ఆత్రేయ ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌ను రెండు కోణాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి.. రెండు పాత్రల్లోనూ బాలయ్యే నటించడం, రెండు.. బాలయ్య సరసన మరో స్టార్ హీరోను మరో కీలక పాత్ర కోసం తీసుకోవడం. ఈ రెండు వెర్షన్లు పూర్తయ్యాక, బాలయ్యతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘కురుక్షేత్రం’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో కనిపిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది చివర్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వివేక్ ఆత్రేయ మార్క్ స్క్రీన్‌ప్లేతో బాలయ్య మాస్ విధ్వంసం ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
