Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!

Nani

Nani

Jadal Look: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ రా అండ్ రస్టిక్ పాన్-ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి సంచలన విజయం తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్న నాని.. సినిమా కథ, తన డిఫరెంట్ లుక్ వెనుక ఉన్న రిస్క్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో నాని కనిపించనున్న జడల్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లుక్ వెనుక ముందు తాను ఎదుర్కొన్న భయాలను నాని నిర్మొహమాటంగా బయటపెట్టారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. “డైరెక్టర్ శ్రీకాంత్ నన్ను ఇలాంటి హెయిర్ స్టైల్ వేసుకోవాలని అడిగినప్పుడు కథపరంగా దానికి బలమైన కారణం ఉన్నప్పటికీ మొదట నేను కాస్త ఆలోచించాను. ఇది బెడిసికొట్టే ప్రమాదం కూడా ఉంది.. ఏమాత్రం తేడా కొట్టినా సోషల్ మీడియాలో పెద్ద మీమ్ మెటీరియల్ అయిపోతానేమో, ట్రోల్స్ వస్తాయేమో అనిపించింది. కానీ ‘ఆయా షేర్’ సాంగ్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయాను. అదే ఇప్పుడు పెద్ద ట్రెండ్‌గా మారిపోయింది. ఇన్ స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం, అభిమానులు తమ ఫేవరెట్ హీరోలకు ఈ తరహా జడలు వేసి ఏఐ ఫొటోలు క్రియేట్ చేయడం, చివరకు గణేశ్ విగ్రహాలకు కూడా ఆ గెటప్ వేయడం చూస్తే నమ్మకంతో పనిచేస్తే అన్నీ వాటంతట అవే కుదురుతాయని అర్థమైంది” అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుత కమర్షియల్ సినిమాల ధోరణిపై నాని తనదైన శైలిలో విశ్లేషించారు. “ఇటీవల వస్తున్న చాలా కమర్షియల్ చిత్రాల్లో కేవలం పాటలు, ఫైట్ల కోసమే ఎమోషన్స్‌ను పైపైన స్పృశించి వదిలేస్తున్నారు. హీరో విలన్‌ను కొడుతున్నప్పుడు కూడా ప్రేక్షకుడిలో ఆ స్థాయిలో కోపం గానీ, సిట్యుయేషన్ ఇంటెన్సిటీ గానీ కలగడం లేదు. కానీ మన చిన్నతనంలో చూసిన ‘బాజీగర్’ వంటి భారీ కమర్షియల్ సినిమాల్లో భావోద్వేగాలు చాలా లోతుగా, నిజాయతీగా ఉండేవి. ‘ది ప్యారడైజ్’ అచ్చం అలాంటి బలమైన ఎమోషన్స్‌ను పట్టుకునే అరుదైన చిత్రం. తెరపై పాత్ర పడే బాధైనా, ప్రేమ అయినా చూసే ప్రేక్షకుడికి గుండెల్లో హత్తుకుంటుంది. సినిమా మొదలైన తర్వాత థియేటర్లలో ఉన్నామనే మాటే మర్చిపోయి, ఆ ప్రపంచంలోకి పూర్తిగా వెళ్లిపోతారు” అంటూ నమ్మకం వ్యక్తం చేశారు. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయని, అందుకే తన ఇతర ప్రాజెక్టుల కంటే ఈ సినిమాకే ఎక్కువ కాల్షీట్లు, అధిక శ్రమ కేటాయించానని నాని తెలిపారు. ఔట్ పుట్ చూశాక తన నిర్ణయం నూటికి నూరు శాతం సరైనదేనని అనిపించిందని అన్నారు. కయదు లోహార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని ఈ సినిమాను నార్త్ బెల్ట్‌లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.