Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!

Nani Srikanh Odela Paradise

Nani Srikanh Odela Paradise

Nani: గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్న పదం ‘పాన్-ఇండియా’. దక్షిణాది నుంచి ఏ సినిమా వేరే భాషల్లోకి వెళ్లినా దానికి ఈ లేబుల్ తగిలించడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ ట్రెండ్‌పై న్యాచురల్ స్టార్ నాని తాజాగా చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తన సినిమాలకు గానీ, మరే ఇతర చిత్రాలకు గానీ ‘పాన్-ఇండియా’ అనే ట్యాగ్ తగిలించడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని నాని కుండబద్దలు కొట్టారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన తన సరికొత్త చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో భాగంగా నాని చెన్నై ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం సహా పలు భాషల్లో సెప్టెంబర్ 24న గ్రాండ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా పరిశ్రమలో నెలకొన్న ప్రాంతీయ లేబుల్స్‌పై ఆయన సూటిగా ప్రశ్నించారు.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’, ‘పఠాన్’ చిత్రాలు దక్షిణాదిలోని తెలుగు, తమిళ మార్కెట్లలో భారీ విజయాలు సాధించి కోట్లాది రూపాయల వసూళ్లు రాబట్టాయని నాని గుర్తుచేశారు. అయినప్పటికీ, ఆ చిత్రాలను ఎవరూ ‘పాన్-ఇండియా’ అని పిలవలేదని, కేవలం హిందీ చిత్రాలుగానే గుర్తించారని స్పష్టం చేశారు. కానీ దక్షిణాది నుంచి ఒక మంచి సినిమా ఇతర భాషల్లో ఆదరణ పొందిన వెంటనే దానికి ‘పాన్-ఇండియా’ అనే ముద్ర ఎందుకు వేస్తున్నారని ఆయన నిలదీశారు. సినిమాకు భాషా సరిహద్దులు ఉండవని, కథ బలంగా ఉంటే ప్రేక్షకులు దాన్ని తమ సొంత చిత్రంగానే ఆదరిస్తారని నాని పేర్కొన్నారు. ముఖ్యంగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం వంటి డైరెక్టర్ల చిత్రాలు తన సినీ లైఫ్‌పై ప్రభావం చూపాయని, తనకు తమిళ సినిమా ఒక ‘బైబిల్’ లాంటిదని అన్నారు. ఇలాంటి ట్యాగులు, భాషా సరిహద్దుల గోడలు లేకుండా తన సినిమా అన్ని భాషల ప్రేక్షకులను సమానంగా అలరించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కంటెంట్‌ను భాషలతో, లేబుల్స్‌తో విభజించకుండా కేవలం ‘భారతీయ సినిమా’గా మాత్రమే చూడాలన్న నాని అభిప్రాయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ బోల్డ్ స్టేట్‌మెంట్‌తో ‘ది ప్యారడైజ్’ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి.