ప్రముఖ యాంకర్, నటుడు టిఎన్‌ఆర్ ను సోమవారం (మే 10) కోవిడ్ -19 బలి తీసుకుందన్న విషయం మీడియా వర్గాలను, తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. టిఎన్‌ఆర్ కు వారం క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హైదరాబాద్, మల్కాజ్ గిరి లోని ఆసుపత్రిలో చేరారు. టిఎన్ఆర్ ఆక్సిజన్ స్థాయి గణనీయంగా తగ్గడం వల్ల శ్వాస సమస్యతో బాధపడుతూ సోమవారం తుది శ్వాస విడిచారని తెలుస్తోంది. నాని, విజయ్ దేవరకొండ, విష్ణు మంచు, అనిల్ రావిపూడి, దర్శకుడు మారుతీ, గోపీచంద్ మలినేని, సందీప్ కిషన్ వంటి టాలీవుడ్ సెలెబ్రిటీలు టిఎన్ఆర్ ఆకస్మిక మరణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.
“టిఎన్ఆర్ గారు కన్నుమూశారని విని షాక్ అయ్యాను. అతని ఇంటర్వ్యూలలో కొన్నింటిని చూశాను. ఆయన పరిశోధన, అతిథులతో మనస్ఫూర్తిగా మాట్లాడే తత్వం గొప్పగా ఉంటాయి. ఆయన కుటుంబానికి బలం చేకూరాలని కోరుకుంటూ సంతాపం తెలియజేస్తున్నాను” అంటూ నాని ట్వీట్ చేశాడు.
“మీ గురించి ఆలోచిస్తూ మన రెండు సుదీర్ఘ సంభాషణలను, మీ నిజమైన ఆసక్తి, ప్రేమ, సహనాన్ని గుర్తు చేసుకుంటున్నాను. మీ కన్నుమూత ఇంట్లో అందరినీ కదిలించింది. మై రెస్పెక్ట్ అండ్ లవ్” అంటూ విజయ్ దేవరకొండ టిఎన్ఆర్ తో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసుకున్నాడు. ఇంకా పలువురు సెలెబ్రిటీలు టిఎన్ఆర్ మరణవార్త షాక్ కు గురి చేసింది అంటూ ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేశారు.