Nandamuri Tejaswini: నందమూరి కుటుంబం నుంచి మరో వారసురాలు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజస్విని నిర్మాతగా ఓ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారట. ఇప్పటికే తండ్రి సినిమాల వ్యవహారాలు చూసుకుంటూ, ‘అన్‌స్టాపబుల్’ లాంటి షోలకు క్రియేటివ్ హెడ్‌గా పనిచేసిన తేజస్విని, ఇప్పుడు పూర్తిస్థాయి ప్రొడ్యూసర్‌గా మారుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
తేజస్విని నిర్మిస్తున్న ఈ ఫస్ట్ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తున్నారనే విషయంపై ఆసక్తికర అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. నిఖిల్ హీరోగా వస్తున్న భారీ చిత్రం ‘స్వయంభు’ నిర్మాత భువన్ ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారట. ఒక కొత్త, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఆధారంగా భువన్ ఈ స్టోరీని రెడీ చేయగా, అది నచ్చడంతో తేజస్విని నిర్మించేందుకు ముందుకొచ్చారని చెబుతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెల గ్రాండ్‌గా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కీలక సన్నివేశాలతో తొలి షెడ్యూల్ మొదలుకానుందట. దీనికి సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఒక వేళ ఈ వార్తలు నిజం అయితే నిర్మాతగా బాలయ్య చిన్న కూతురు తేజస్విని, తన తొలి ప్రయత్నంలోనే ఎలాంటి విజయాన్ని అందుకుంటారో వేచి చూడాలి.

