సుదీర్ఘ విరామం తర్వాత, 80వ దశకంలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. స్వప్న సినిమాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఛాంపియన్’ చిత్రంలో ఆయన ఓ కీలక పాత్ర పోషించనున్నారు. నందమూరి త్రివిక్రమరావు (ఎన్టీఆర్ సోదరుడు) కుమారుడైన కళ్యాణ్ చక్రవర్తి, బాలకృష్ణతో పాటు దాదాపు అదే జనరేషన్‌లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మొదట ‘తలంబ్రాలు’, ‘ఇంటి దొంగ’, ‘దొంగ కాపురం’, ‘మేనమామ’, ‘అక్షింతలు’ వంటి కుటుంబ కథా చిత్రాలతో ఆయన ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత మాస్ ప్రేక్షకులను ఆకర్షించేందుకు ‘రౌడీ బాబాయ్’, ‘రుద్రరూపం’ వంటి యాక్షన్ సినిమాల్లో నటించారు.
Also Read :November Tollywood: చిన్న సినిమాల హవా, మూడు మాత్రమే బ్రేక్ ఈవెన్
1989లోనే విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘లంకేశ్వరుడు’లో కళ్యాణ్ చక్రవర్తి కీలక పాత్ర (చిరంజీవి చెల్లెలు రేవతి భర్తగా) పోషించారు. ‘భక్త కబీర్‌దాస్’లో శ్రీరాముడిగా నటించారనే విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. మంచి కెరీర్ స్టేజ్‌కు వెళ్తారని అందరూ భావిస్తున్న సమయంలో, ఆయన హఠాత్తుగా సినిమా రంగానికి దూరమయ్యారు. దీనికి ప్రధాన కారణం ఒక ఘోర రోడ్డు ప్రమాదం. ఆ ప్రమాదంలో కళ్యాణ్ చక్రవర్తి తమ్ముడు హరీన్ చక్రవర్తి మరియు ఆయన కొడుకు పృథ్వి ప్రాణాలు కోల్పోయారు. అదే యాక్సిడెంట్‌లో ఆయన తండ్రి త్రివిక్రమరావు గాయాలతో బయటపడ్డారు. ఈ సంఘటన కళ్యాణ్ చక్రవర్తిని తీవ్రంగా కలచివేసింది. ఆ బాధ నుంచి తేరుకోలేక, ఆయన నటనకు గుడ్‌బై చెప్పి, గాయపడిన తన తండ్రికి సేవ చేస్తూ వచ్చారు. చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చినా, ఆయన తండ్రితో కలిసి అక్కడే ఉండిపోయారు. తండ్రి మరణించిన తర్వాత కూడా ఆయన చెన్నైలోనే ఉంటూ వ్యాపారాలు చేసుకున్నారు.
Also Read :Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేపై ఐరెన్ లెగ్ ముద్ర చెరిగేదెప్పుడు?
35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, కళ్యాణ్ చక్రవర్తిని తిరిగి వెండితెరకు తీసుకురావడానికి స్వప్న సినిమాస్ గతంలో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సమయం నుంచే ప్రయత్నించింది, కానీ ఆయన అన్ని ఆఫర్లను తిరస్కరించేవారు. చివరకు, ‘ఛాంపియన్’ కథ, అందులో ఆయన పాత్ర ‘డెప్త్’ నచ్చడంతో, ఆయన రీఎంట్రీకి అంగీకరించారు. ఈ చిత్రంలో ఆయన ‘రాజా రెడ్డి’ అనే, రియలిజంకు దగ్గరగా ఉండే కీలక పాత్రలో కనిపించనున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో, అనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి స్వప్న సినిమాస్ ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తోంది. యువ నటుడు రోషన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, మలయాళ సంచలనం అనస్వర రాజన్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రదీప్ అద్వైతం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఛాంపియన్’ చిత్రం ఈ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
