Nagarjuna King 100: నో పోస్ట్‌పోన్.. అనుకున్న డేట్‌కే బాక్సాఫీస్ వేటకు వస్తున్న ‘కింగ్’ నాగార్జున!

Nagarjuna King 100 Release Date December 24 2026

Nagarjuna King 100 Release Date December 24 2026

Nagarjuna King 100: అక్కినేని అభిమానులను గత కొన్ని రోజులుగా కలవరపెడుతున్న వాయిదా పుకార్లకు ఎట్టకేలకు తెరపడింది. నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్) అనుకున్న సమయానికి రాకపోవచ్చని, రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర బృందం తాజాగా తేల్చిచెప్పింది. ఎలాంటి వాయిదా లేకుండా అనుకున్న డేట్‌కే బాక్సాఫీస్ వేటకు వస్తున్నామంటూ మేకర్స్ సాలిడ్ క్లారిటీ ఇచ్చేశారు.

డిసెంబర్ 24, 2026న ‘కింగ్ 100’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతోంది. రిలీజ్‌కు సరిగ్గా 30 రోజుల సమయం మాత్రమే ఉందంటూ మేకర్స్ తాజాగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఒక్క పోస్టర్‌తో ఇప్పటివరకు వచ్చిన రూమర్స్ అన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేయడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కౌంట్‌డౌన్ మొదలవడంతో ఇక ప్రమోషన్ల జోరు కూడా పెరగనుంది.

దర్శకుడు రా.కార్తీక్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, టీ-సిరీస్ సౌత్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఎవర్‌గ్రీన్ బ్యూటీ టబు నటిస్తుండటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. వీరితో పాటు అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, సుశాంత్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.