దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన ‘మనం’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అక్కినేని మూడు తరాల నటుల (ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్) కలయికలో వచ్చిన ఒక దృశ్య కావ్యం. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) చివరి చిత్రం కూడా ఇదే. నేడు మే 23 సందర్భాన్ని పురస్కరించుకుని నాగార్జున అక్కినేని.. అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలుపుతూ, తన తండ్రిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
నాగార్జున తన ట్వీట్‌లో ‘మనం’ సినిమా తనకు అందించిన గౌరవాన్ని, అనుభూతిని ఈ విధంగా పంచుకున్న..‘ఈరోజు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, ఆశీస్సులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మే 23 నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని తేదీ! మా లెజెండరీ ఫాదర్ ఏఎన్నార్ గారి చివరి చిత్రం ‘మనం’ ను నిర్మించి, విడుదల చేసే గొప్ప గౌరవం నాకు దక్కిన రోజు ఇదే. నా తండ్రితో (ANR) నా కుమారుడితో (నాగచైతన్య) కలిసి ఒకే స్క్రీన్‌పై నటించే అరుదైన అదృష్టం నాకు ఈ సినిమా ద్వారానే దక్కాయి..’ అంటూ నాగార్జున ఎమోషనల్ అయ్యారు.
మనం సినిమా అప్పట్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ డ్రామాను దర్శకుడు విక్రమ్ కుమార్ మలిచిన తీరు అద్భుతం. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం, ముఖ్యంగా ఏఎన్నార్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాయి. సినిమా చివర్లో అఖిల్ అక్కినేని ఎంట్రీ అప్పట్లో థియేటర్లలో పూనకాలు తెప్పించింది.నాగార్జున చేసిన ఈ ట్వీట్‌పై అక్కినేని ఫ్యాన్స్ స్పందిస్తూ.. “తెలుగు సినిమా ఉన్నంత కాలం ‘మనం’ నిలిచిపోతుంది”, “ఏఎన్నార్ గారిని మేము ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం నాగ్ సార్” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అక్కినేని ఇంటర్నేషనల్ స్టూడియోస్ (అన్నపూర్ణ స్టూడియోస్) బ్యానర్‌పై వచ్చిన ఈ చిత్రం అక్కినేని ఫ్యామిలీకి ఒక లైఫ్ టైమ్ మెమొరీ.
