Nag – Chiru Multistarrer: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున కలిసి ఒకే సినిమాలో పూర్తిస్థాయిలో నటిస్తే చూడాలని ఇండస్ట్రీ వర్గాలతో పాటు కోట్లాది మంది అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన ‘స్టైల్’ సినిమాలో కేవలం అతిథి పాత్రల్లో కాసేపు తళుక్కున మెరిసినా, ఇద్దరూ కలిసి నటించే పూర్తి స్థాయి మల్టీస్టారర్ మాత్రం ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. చిరంజీవి తన 155వ సినిమాతో, నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ చిత్రంతో బిజీగా ఉన్న వేళ.. వీరిద్దరి కాంబినేషన్‌పై నాగ్ స్వయంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
తాజాగా ‘ఇట్లు అర్జున’ ప్రెస్ మీట్ సందర్భంగా మీడియా నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న నాగార్జునకు ఎదురైంది. “మీరిద్దరూ ఎప్పుడు కలిసినా మంచి కథ వస్తే సినిమా చేస్తామని చెబుతుంటారు కదా, మరి ఆ కాంబినేషన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది?” అని ప్రశ్నించగా నాగార్జున సూటిగానే బదులిచ్చారు. “నేను కూడా ఆ సినిమా కోసం ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్నాను. మా ఇద్దరి మధ్య చాలా మంచి స్నేహం, అద్భుతమైన ర్యాపో ఉంది. మేమిద్దరం ఎప్పుడు ఎక్కడ కలిసినా కూడా.. కచ్చితంగా కలిసి ఒక సినిమా చేయాలనే మాట్లాడుకుంటాం. కానీ ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ కుదరాలంటే ప్రతిదానికీ ఒక సరైన సమయం రావాలి. ఆ టైమ్ తప్పకుండా వస్తుంది, అప్పుడు ఈ సినిమా కచ్చితంగా జరుగుతుంది” అంటూ అసలు ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో నాగ్ క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్‌తో కలిసి నటించడానికి స్వయంగా తాను రెడీ అని నాగార్జున పచ్చజెండా ఊపడంతో, ఈ ఇద్దరు దిగ్గజాలకు సరిపోయే పవర్ఫుల్ స్క్రిప్ట్‌తో ఏ దర్శకుడు ముందుకొస్తాడా అని సినీ ప్రియులు ఆసక్తిగా చూస్తున్నారు. సరైన సమయం చూసుకుని ఈ కాంబో గనక సెట్స్ పైకి వెళ్తే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

