NTRxTrivikram: గత కొద్దిరోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే ఒక్క వార్త హాట్ టాపిక్‌గా నడుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, తన సొంత గూడు లాంటి హారిక అండ్ హాసిని, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంపౌండ్‌ను వీడుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాను ఊపేసింది. నిర్మాత చినబాబు (రాధాకృష్ణ), నాగవంశీలతో త్రివిక్రమ్‌కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి బలమైన బాండింగ్ మధ్య మనస్పర్థలు వచ్చాయని, గురూజీ ఇకపై డీవీవీ (DVV) బ్యానర్ వైపు అడుగులు వేస్తున్నారంటూ గాసిప్స్ గుప్పుమన్నాయి.
ఈ ఊహాగానాలు కాస్తా.. తారక్ అభిమానుల్లో గుబులు రేపాయి. ఎందుకంటే, ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘గాడ్ ఆఫ్ వార్’ పరిస్థితి ఏంటనే ప్రశ్న అందరినీ వేధించింది. బ్యానర్ విభేదాల కారణంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను పక్కన పెడతారా? లేక అసలు ఈ సినిమానే ఆగిపోతుందా? అని నందమూరి ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా రకరకాల చర్చలు మొదలయ్యాయి. అయితే, ఈ సస్పెన్స్‌కు, ఫ్యాన్స్ టెన్షన్‌కు నిర్మాత నాగవంశీ తనదైన స్టైల్‌లో ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టకుండా, పెద్ద పెద్ద స్టేట్‌మెంట్లు ఇవ్వకుండా.. కేవలం ఒక్క ఫోటోతో విమర్శకుల నోళ్లు మూయించారు. నాగవంశీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ స్పెషల్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందులో నిర్మాత చినబాబు, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నందమూరి కళ్యాణ్ రామ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తున్నారు. ఈ ఒక్క క్లిక్‌తో ఇన్ని రోజులు చక్కర్లు కొట్టిన రూమర్లన్నీ ఉత్త పుకార్లేనని తేలిపోయింది. హారిక అండ్ హాసిని కాంపౌండ్‌తో గురూజీ బంధం చెక్కుచెదరలేదని, ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రాబోయే ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్ట్ పూర్తిగా సేఫ్ అని నాగవంశీ చెప్పకనే చెప్పేశారు. ఈ ఫోటో చూసిన తారక్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూ.. ‘మా అన్నయ్య సినిమాకు ఏ ఢోకా లేదు’ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
😎♥️
@NTRxTrivikram https://t.co/BOO8Y6FIKL
— Naga Vamsi (@vamsi84) November 13, 2026

