Producer Naga Vamsi: నిర్మాతలు ఎందుకు కొట్టుకుంటారో చెప్పేసిన నాగవంశీ.. ఆ రోజులు పోయాయంటూ కామెంట్స్!

Naga Vamsi

Naga Vamsi

Producer Naga Vamsi: సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య అప్పుడప్పుడు విభేదాలు, విమర్శలు, ఆరోపణలు తెరపైకి వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ వివాదాలు వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడం కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆ పరిస్థితులు మారాయని, నిర్మాతల మధ్య గతంలో ఉన్న పోటీ, ఈర్ష్య తగ్గిపోయి ఐక్యత పెరిగిందని ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. నిర్మాతల మధ్య విభేదాలు, ఇండస్ట్రీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒకప్పుడు ఎవరి సినిమా పెద్ద హిట్ అయినా, మంచి సినిమా వచ్చినా కొంతమందిలో అసూయ ఉండేదని చెప్పారు.

తమ సినిమా కాకుండా ఇతరుల సినిమా సక్సెస్ కాకూడదనే ఆలోచన కూడా కొంతమందిలో ఉండేదన్నారు. అయితే గత ఏడాది కాలంగా ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయి, ఆ రోజులు పోయాయన్నారు. ఇటీవల పలు అంశాలపై నిర్మాతల మధ్య చర్చలు జరిగినప్పటికీ.. అవి అందరినీ మరింత దగ్గర చేశాయని పేర్కొన్నారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో రెవెన్యూ తగ్గడం, థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యలో మార్పులు, ఆదాయ అవకాశాలు తగ్గిపోవడం వంటి సమస్యలు నిర్మాతలందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చాయని వివరించారు. ప్రస్తుతం ఏ నిర్మాత సినిమా విడుదలైనా మిగతా నిర్మాతలు కూడా అది సక్సెస్ కావాలని కోరుకుంటున్నారని నాగవంశీ వెల్లడించారు. ఎక్కువ సినిమాలు విజయవంతమై ప్రేక్షకులు థియేటర్లకు వస్తే అది మొత్తం పరిశ్రమకు మంచిదనే ఆలోచన నిర్మాతల్లో పెరిగిందన్నారు. ఒకరి సినిమా మరొకరు పోటీగా కాకుండా.. పరిశ్రమ మొత్తం బాగుపడాలనే ఉద్దేశంతో నిర్మాతలు ముందుకు సాగుతున్నారని నాగవంశీ కామెంట్స్ చేశారు.