Naga Vamsi: ‘ఇది అంత కలర్‌ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!

Nagavamsi

Nagavamsi

Naga Vamsi: సినిమా ఫీల్డ్ బయటికి ఎంతో కలర్‌ఫుల్ ప్రపంచంలా కనిపించినప్పటికీ.. నిర్మాతలు, దర్శకులు ఎదుర్కొనే ఒత్తిడి అంతా బయటకు కనిపించదని ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అన్నారు. సినిమా ఫెయిల్యూర్‌ను తాను అంత సింపుల్‌గా తీసుకోలేనని, సినిమా రిలీజ్‌కి ముందు తీవ్ర ఒత్తిడికి గురవుతానని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. సినిమా నిర్మాణంలో ఉండే మానసిక ఒత్తిడి, రిలీజ్ సమయంలో ఎదురయ్యే టెన్షన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూరేనని.. దాన్ని తాను అంత ఈజీగా అంగీకరించలేనని చెప్పారు. సినిమా ఫలితం నెగిటీవ్ వస్తే కొన్ని రోజుల పాటు తాను మానసికంగా తీవ్రంగా ప్రభావితమవుతానని చెప్పారు.

ముఖ్యంగా సినిమా రిలీజ్‌కి ముందు రోజు తనకు అసలు నిద్ర, తిండి ఉండవని నాగవంశీ పేర్కొన్నారు. సినిమా విడుదలైన తర్వాత రెవెన్యూ సెటిల్‌మెంట్‌కు సంబంధించిన విషయాలు స్పష్టంగా తెలిసే వరకు తీవ్ర ఆందోళన ఉంటుందని చెప్పారు. బయటకు చూస్తే నిర్మాతలు చాలా ప్రశాంతంగా, సంతోషంగా కనిపించినప్పటికీ.. వారి మనసులో ఎలాంటి ఒత్తిడి నడుస్తుందో ఎవరికీ తెలియదన్నారు. తనతో పాటు ప్రయాణించే ఇద్దరు, ముగ్గురు వ్యక్తులకు మాత్రమే తన ఒత్తిడి ఎంత ఉంటుందో తెలుసని అన్నారు. వారితో తరచూ ఫోన్లో మాట్లాడుతుంటానని, తన ఆందోళనను దగ్గరగా ఉండేవారే అర్థం చేసుకోగలరని చెప్పారు. సినిమా రిలీజ్‌కు ముందు వారం రోజుల పాటు అంతా ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందని.. అయితే నిర్మాత, దర్శకుడి మనసులో మాత్రం ఎన్నో టెన్షన్స్ ఉంటాయని నాగవంశీ కామెంట్స్ చేశారు. బయట నుంచి చూసినంత గ్లామరస్‌గా సినిమా ఫీల్డ్ ఉండదని, ప్రతి సక్సెస్ వెనుక ఎంతో ఒత్తిడి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.