Naga Chaitanya: నా మౌనాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు

Nagachaitanya

Nagachaitanya

Naga Chaitanya: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఎప్పుడూ వివాదాలకు దూరంగా, చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. సోషల్ మీడియాలో తన గురించి ఎలాంటి వార్తలు చక్కర్లు కొట్టినా, విమర్శలు ఎదురైనా ఆయన మౌనంగానే ఉండిపోతారు. అయితే, తన ఈ మౌనాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని నాగచైతన్య తాజాగా అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడిన చైతూ.. తన స్వభావం, సోషల్ మీడియా ట్రోల్స్, అలాగే వైవాహిక జీవితంలో వచ్చిన మార్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బయట జరిగే ప్రచారాలపై తాను ఎందుకు స్పందించనో వివరిస్తూ.. ఇంటర్నెట్‌లో ఏదీ శాశ్వతం కాదని నాగచైతన్య స్పష్టం చేశారు. ఇవాళ ఉన్న వార్త స్థానంలోకి రేపు మరో కొత్త వార్త వస్తూనే ఉంటుందని, అందుకే తాను నెగటివిటీని పెద్దగా పట్టించుకోనని తన లైఫ్ ఫిలాసఫీని చెప్పుకొచ్చారు. ఈ నెలలోనే తాను 40వ ఏట అడుగుపెడుతున్నానని గుర్తుచేసుకున్న చైతూ, గతానికంటే ఇప్పుడు జీవితాన్ని చూసే కోణం మరింత మారిందని తెలిపారు. తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ భార్య శోభిత ధూళిపాళపై చైతూ ప్రశంసలు కురిపించారు. తాను ఎప్పుడూ ఒక కంఫర్ట్ జోన్‌లో ఉండటానికి ఇష్టపడేవాడినని, కానీ శోభిత పరిచయమయ్యాక ఆ ఆలోచన మారిందని చెప్పారు. జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించడం, కొత్త విషయాలను అన్వేషించడం ఆమె నుంచే ఎంతో నేర్చుకున్నానని మనసులోని మాటను బయటపెట్టారు.

సినిమాల విషయానికొస్తే, ఇకపై తన గత చిత్రాలతో ఎలాంటి పోలిక లేని కొత్త తరహా కథలనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు నాగచైతన్య తెలిపారు. తన అప్‌కమింగ్ మూవీ ‘వృషకర్మ’లో తాను ‘ట్రెజర్ హంటర్’ పాత్రలో కనిపించబోతున్నానని, తెలుగు తెరకు ఈ కాన్సెప్ట్ చాలా ఫ్రెష్‌గా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమాపై తాను భారీ ఆశలు పెట్టుకున్నానని చెప్పారు. దీంతో పాటు తనకు ఫార్ములా-1 రేసింగ్ అంటే ఎంతో ఇష్టమని, మాక్స్ వెర్స్టాపెన్ తన ఫేవరెట్ డ్రైవర్ అని చెప్పుకొచ్చారు.