Mumbai Police High Alert: గ్యాంగ్‌స్టర్ల టార్గెట్‌లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్‌.. వాటి జోలికి వెళ్లకండి..!

Mumbai Police High Alert

Mumbai Police High Alert

Mumbai Police High Alert: బాలీవుడ్‌ స్టార్స్‌ ఎక్కడికి వెళ్లినా.. ఫ్యాన్స్‌ హంగామా ఉంటుంది.. సెల్ఫీల కోసం ఎగబడతారు.. ఒక్క ఫొటో అంటూ రిక్వస్ట్ చేస్తుంటారు.. తమ అభిమానాన్ని చాటు కోవడానికి ఏదైనా చేసేస్తుంటారు.. అయితే, కొన్ని ఘటనలు ఇప్పుడు టాప్‌ స్టార్స్‌కు నిద్ర లేకుండా చేస్తున్నాయట.. దీంతో, బాలీవుడ్ సినీ ప్రముఖుల భద్రతపై ముంబై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గ్యాంగ్‌స్టర్ల నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో నటీనటులు అప్రమత్తంగా ఉండాలని కీలక సూచనలు జారీ చేసింది. జనసమూహాలకు, అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో అభిమానులతో సెల్ఫీలు దిగడం, ఎక్కువసేపు గుమిగూడిన ప్రాంతాల్లో ఉండటం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించింది.

టైగర్ ష్రాఫ్ నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో పోలీసులు ఈ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. నటీనటులు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అభిమానులతో సమావేశాలు నిర్వహించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రముఖ నటుల వ్యక్తిగత భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్న పోలీసులు, వారి కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది భద్రతపైనా దృష్టి సారించారు. మరోవైపు, టైగర్ ష్రాఫ్‌పై దాడికి ముందు పలువురు బాలీవుడ్ ప్రముఖుల ఇళ్ల వద్ద దుండగులు రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. సోషల్ మీడియా పోస్టులు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా నటీనటుల కదలికలను గమనించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఎలాంటి వాహనాల్లో ప్రయాణిస్తున్నారు? వారి భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అనే వివరాలను సైతం సేకరించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ తదితర ప్రముఖుల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సల్మాన్ ఖాన్ నివాసం వద్ద ఇప్పటికే కట్టుదిట్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. అమితాబ్ బచ్చన్ సైతం తన నివాసం జల్సా వద్ద అభిమానులకు అభివాదం చేసే సమయంలో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నిలబడుతున్నారు. గ్యాంగ్‌స్టర్ల బెదిరింపుల నేపథ్యంలో ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది భద్రత విషయంలోనూ మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక, ఈ భద్రతా హెచ్చరికలకు ప్రధాన కారణంగా నిలిచిన ఘటన అక్టోబర్ 18న ముంబైలోని జుహులో చోటుచేసుకుంది. ఫుట్‌బాల్ ఆడి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో టైగర్ ష్రాఫ్ కారును లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు. అభిమానులు గుమిగూడిన ప్రాంతంలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. అయితే టైగర్ ష్రాఫ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ కాల్పుల్లో ఆయన డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. ఈ ఘటనతో బాలీవుడ్ ప్రముఖుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి టనలు పునరావృతం కాకుండా ముంబై పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రముఖుల కదలికలు, నివాస ప్రాంతాలు, వారు తరచూ సందర్శించే ప్రదేశాల వద్ద భద్రతను పెంచుతూ అప్రమత్తత కొనసాగిస్తున్నారు.