NTV Telugu Site icon

Talasani Srinivas Yadav : ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దు

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

వేతనాలు పెంచాలంటూ తెలుగు చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల్లోని కార్మికులు నేడు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ముందు నిరసన చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందిస్తూ.. సినీ కార్మికుల డిమాండ్స్ కూర్చోని పరిష్కరించుకోవాలన్నారు. కరోనా కారణంగా కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారని, ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్మికులను చర్చలకు పిలవాలన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దని, లేబర్ డిపార్ట్మెంట్ కు సమ్మె లేఖ ఇవ్వలేదని ఆయన అన్నారు. రెండుమూడు రోజుల్లో సమస్య పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. నరేంద్రమోడీ రోజు ప్రపంచం గురించి నీతులు చెబుతారని, ప్రజా ప్రభుత్వాలు ఉండటం మోడీకి ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. ప్రపంచ దేశాల ముందు భారతదేశ పరువు, ప్రతిష్ట పోతుందని ఆయన మండిపడ్డారు. ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదని, దేశం సర్వనాశం అవ్వాలని బీజేపీ కోరుకుంటుందని ఆయన విమర్శించారు.

తలెత్తుకుని గర్వంగా నిలబడలేకపోతుందని, ఎలక్టేడ్ గవర్నమెంట్లు ఉండటం ఓర్వలేక పోతున్నారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్నారని, మోడీ, షా దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ లో అలానే జరిగిందని, ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఇవ్వడం, బస్సులు ఏర్పాటు చేయడం అనుమానాలు కలిగిస్తోందన్నారు. అధికారం శాశ్వతం కాదు… బీజేపీ జీవిత కాలం అధికారంలో ఉండదన్నారు. మహారాష్ట్ర పరిస్థితి బీజేపీకి కూడా వస్తుందని, ఎప్పుడు అన్ని మనకు అనుకూలంగా ఉండవని ఆయన హితవు పలికారు. హైదరాబాద్ అందాలు, రాష్ట్ర ప్రగతిని మోడీ, బీజేపీ ముఖ్యమంత్రులు వచ్చి చూస్తారని, బీజేపీ ముఖ్యమంత్రులు చూసి నేర్చుకునే అవకాశం వచ్చిందన్నారు.