Chiranjeevi-Megaverse: ‘మెగావర్స్‌’లో స్టార్ హీరోల సందడి.. ప్రభాస్, పవన్, చరణ్.. లిస్ట్ ఇంకా పెద్దదే!

Chiranjeevi Megaverse Guest List

Chiranjeevi Megaverse Guest List

Chiranjeevi Megaverse Guest List: ‘మెగాస్టార్’ చిరంజీవి మొదటిసారిగా ఓటీటీ వేదికపై హోస్ట్‌గా మారిన విషయం తెలిసిందే. సెలబ్రిటీ టాక్ షో ‘మెగావర్స్’కు ఆయన హోస్ట్‌గా వ్యవరిస్తున్నారు. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో మెగావర్స్ త్వరలో ప్రసారం కానుంది. ఈ షోపై టాలీవుడ్‌లో రోజురోజుకూ అంచనాలు రెట్టింపవుతున్నాయి. షోలో టాలీవుడ్ అగ్ర తారలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు చిరు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తతం స్టార్ హీరోలతో ప్రత్యేక ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్‌తో పాటు ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్లతో ఎపిసోడ్స్‌కు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్‌ను సిద్ధం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

నవంబర్ 22న ప్రభుదేవా, ప్రముఖ సంగీత దర్శకుడు థమన్‌తో కలిసి చిరంజీవి ప్రత్యేక ఎపిసోడ్ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. అనంతరం నవంబర్ 24 నుంచి రవితేజ, నానితో ఎపిసోడ్ చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ కాంబినేషన్లు తెరపై ఎలా సందడి చేస్తాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తదుపరి షెడ్యూల్‌లో కోలీవుడ్ స్టార్స్ సూర్య, జ్యోతిక, కార్తీతో చిరంజీవి ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రత్యేక ఎపిసోడ్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఇక మెగావర్స్‌లో తదుపరి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో ఈ ఇద్దరు హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అయితే ఈ ఎపిసోడ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రసార తేదీలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. స్టార్ హీరోలతో రూపొందుతున్న ఈ ప్రత్యేక ఎపిసోడ్స్‌పై టాలీవుడ్‌లో ఆసక్తి పెరుగుతోంది. ప్రభుదేవా నుంచి ప్రభాస్ వరకు, పవన్ కల్యాణ్ నుంచి రామ్ చరణ్ వరకు పలువురు ప్రముఖులు మెగావర్స్‌లో సందడి చేయనున్నారనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.