యువ సామ్రాట్ నాగచైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న మైథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ విడుదలకు ముందే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కథపై ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు పార్ట్-2 ఉండేలా ఓపెన్ ఎండింగ్ ఉంటుందా అనే ప్రశ్నపై తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి తనదైన శైలిలో చమత్కారంగా స్పందించారు.
కథలోని కీలక మలుపులను ఇప్పుడే బయటపెట్టలేనని చెబుతూ.. “ఈ విషయంపై నేను ఎక్కువగా మాట్లాడితే డైరెక్టర్ నన్ను చంపేస్తారు” అంటూ ఆమె నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఆ సస్పెన్స్ అంతా డిసెంబర్ 4న థియేటర్లలోనే వీడుతుందని ఆమె ఆసక్తికర హింట్ ఇచ్చారు. మరోవైపు, ఈ చిత్రంలో తన పాత్రకు తాను సొంతంగా డబ్బింగ్ చెప్పుకోలేదని మీనాక్షి వెల్లడించారు. గతంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు తన గొంతునే వినిపించినప్పటికీ, ‘వృషకర్మ’ కోసం మాత్రం డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్‌ను వాడినట్లు తెలిపారు. భవిష్యత్తులో రాబోయే ప్రాజెక్టులలోనైనా సొంతంగా డబ్బింగ్ చెప్పుకునే అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడిగా నటించగా, జయరామ్, సత్య, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, రాగుల్ ధరుమన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి.

