తాజాగా విడుదలైన ‘భైరవం’ సినిమా సక్సెస్ మీట్‌లో రీ రిలీజ్ ట్రెండ్ గురించి మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి ‘భైరవం’ సినిమా కంటే తాజాగా రీ-రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా ‘ఖలేజా’కు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మీడియా నుంచి అదే ప్రశ్న ఎదురైంది. రీ-రిలీజ్ సినిమాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయంపై మనోజ్ మాట్లాడుతూ, “ఇప్పటికే ఐపీఎల్ అనే క్రికెట్ ఈవెంట్ కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, పాత సినిమాలను ఇప్పుడు రీ-రిలీజ్ చేయడం సరైనది కాదు,” అని అభిప్రాయపడ్డారు.
Also Read: Kannappa : శివరాజ్ కుమార్ మూవీలో.. విలన్ రోల్ అడిగిన మోహన్ బాబు
ఎందుకంటే, పెద్ద సినిమాలన్నీ పండగ సీజన్‌లను బ్లాక్ చేసేసుకుంటున్నాయని, ఇలాంటి సాధారణ రోజుల్లో కొత్త సినిమాలను రిలీజ్ చేయాలనుకునే సమయంలో రీ-రిలీజ్ సినిమాలు వస్తే, అవి కొత్త సినిమాలను దెబ్బతీస్తున్నాయని ఆయన అన్నారు. “ఇవి కనీసం వీక్‌డేస్‌లో రిలీజ్ చేస్తే బాగుంటుంది. సోమవారం రిలీజ్ చేస్తే, శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలపై ఆ ప్రభావం తక్కువగా ఉండొచ్చు,” అని మనోజ్ సూచించారు. ఒక తెలుగు సినిమాను మరో తెలుగు సినిమాతో దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “‘చంపేయడం’ అనే పదం సరైనది కాకపోవచ్చు, కానీ తప్పనిసరిగా వాడాల్సి వస్తోంది,” అని మనోజ్ చెప్పుకొచ్చారు. ‘భైరవం’ సినిమా నిర్మాత రాధా మోహన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, రీ-రిలీజ్ సినిమాల ప్రభావంపై తన ఆందోళనను వ్యక్తం చేశారు.