మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం జీడిపాకంలా సాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ రావటంతో అనుకున్న సమయానికి నిర్వహించలేక పోయింది ప్రస్తుత కమిటీ. దీంతో రకరకాల వివాదాలతో సభ్యుల వ్యాఖ్యలతో ప్రజలలో చులకనువుతూ వస్తోంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ లోగా మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ తన కమిటీతో పోటీ సిద్ధం అని ప్రకటించటం… మంచు విష్ణు, జీవిత, హేమ వంటి వారు తాము కూడా అధ్యక్షపదవికి పోటీ చేస్తామని ప్రకటించటం ఉత్కంఠతను రేపింది. ఇదిలా ఉంటే తాజాగా ఉపాధ్యక్షురాలిగా ఉన్న హేమ వాయిస్ క్లిప్ తో సభ్యులకు సందేశాన్ని పంపటం అది మీడియాలో లీక్ కావటం కలకలం రేపింది. ఇక అందులో ‘మా’ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, ప్రస్తుత కమిటీ నిధులను వసూలు చేయకపోగా ఉన్న మొత్తాలని ఊడ్చేస్తున్నారని ఆరోపించింది. దీనికి బదులుగా ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్, కార్యదర్శి జీవిత హేమ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. మీడియాకు విడుదల చేసిన వీడియోలో వారిద్దరూ స్పష్టంగా తమ ఆధ్వర్యంలో జరిగినదంతా వివరించారు. హేమ చెప్పినట్లు మాలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేస్తూ లెక్కలతో సహా వివరించారు. అంతే కాదు… మా గౌరవ ప్రతిష్టలు దెబ్బతీసేలా హేమ మాట్లాడారని, ఆమెపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని డిమాండ్ చేశారు. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తప్పవన్నారు.
Read Also : బర్త్ డే : హన్సిక గురించి ఆసక్తికర విషయాలు
ఎన్నికల ఆలస్యానికి కరోనానే కారణమని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్ బాబు వంటి పెద్దలతో కూడిన క్రమశిక్షణా కమిటీ నిర్ణయాలను కూడా తప్పుపడుతూ హేమ వ్యాఖ్యానించటాన్ని తేలిక తీసుకోబోమని వివరించారు. మరి ఒకదాని తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ‘మా’ ఎన్నికలను ఏ తీరాలకు తీసుకెళతాయో చూద్దాం.