దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు, గాయకుడు ఎస్పీ చరణ్ చాలా సంవత్సరాల తర్వాత సినీ రంగంలోకి మళ్లీ అడుగుపెడుతున్నారు. ‘లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)’ అనే చిత్రంతో ఆయన తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మనీషా ఆర్ట్స్ మరియు అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్‌లపై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మాతలుగా, పవన్ కేతరాజు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటిస్తుండగా, ఎస్పీ చరణ్‌తో పాటు నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత ప్రియులకు సుపరిచితమైన సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమైంది. ఈ కాపీని చూసిన సినిమా బృందం సంతోషం వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు.
దర్శకుడు పవన్ కేతరాజు మాటల్లో…ఈ సినిమా కథ తండ్రీకొడుకుల మధ్య బంధాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిందని దర్శకుడు పవన్ కేతరాజు తెలిపారు. “తన కొడుకు బాగుండాలని తండ్రి పడే కష్టం, తండ్రి కోసం కొడుకు చేసే సాహసం ఈ కథలోని ముఖ్యాంశాలు. ఈ కథ మొత్తం కాశీ నేపథ్యంలో సాగుతుంది. సినిమాలో శివతత్వం గురించి కూడా స్పృశించాం. హీరో తండ్రి పాత్రలో ఎస్పీ చరణ్ నటన ఈ సినిమాకు పెద్ద బలం. సినిమా దృశ్యాలు చాలా గంభీరంగా, ఆకట్టుకునేలా ఉంటాయి. మణిశర్మ గారి నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది,” అని ఆయన వివరించారు.ఈ చిత్రానికి సంభాషణలు నాగ మాధురి రాయగా, సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు, ఎడిటింగ్ రామకృష్ణ, కళా దర్శకత్వం చిడిపల్లి శంకర్, నృత్య దర్శకత్వం మొయిన్, యాక్షన్ కార్తీక్, పిఆర్ఓగా మధు వీఆర్ పనిచేశారు.
ఈ సినిమా తండ్రీకొడుకుల భావోద్వేగ కథతో పాటు ఆధ్యాత్మిక అంశాలను కలగలిపి ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. ఏప్రిల్ 4న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.