Kollywood: తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి థియేటర్–ఓటీటీ వివాదం ముదిరింది. సెప్టెంబర్ 1 నుంచి తమిళనాడులో కొత్త తమిళ సినిమాల విడుదలలను నిలిపివేయాలని తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాల విడుదలలతో పాటు షూటింగ్‌లు, పోస్ట్‌ప్రొడక్షన్ పనులను కూడా నిలిపివేయాలనే నిర్ణయం తీసుకోవడం కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. 8 వారాల ఓటీటీ విండోపై నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాల మధ్య వివాదం మరింత ముదిరింది.. థియేటర్లలో విడుదలైన సినిమాలను కనీసం 8 వారాలు పూర్తయిన తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారు.. అంతేకాదు.. ఈ నిబంధనను అంగీకరిస్తున్నట్టు నిర్మాతల నుంచి రాతపూర్వక అంగీకార లేఖ కూడా కోరుతున్నారు.. అయితే నిర్మాతల ప్రమేయం లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ నిర్మాతల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తమిళ సినీ ప్రస్తుత నిర్మాతల సంఘం సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త తమిళ సినిమాలను థియేటర్లలో విడుదల చేయకూడదని నిర్ణయించాయి.. అదే తేదీ నుంచి తమిళ చిత్రసీమకు సంబంధించిన షూటింగ్‌లు, ఎడిటింగ్, డబ్బింగ్, వీఎఫ్‌ఎక్స్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిగా నిలిపివేయాలని ప్రకటించాయి..
ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో లేని నిబంధనను కేవలం తమిళనాడులోనే అమలు చేయడంపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఏడాదికి సుమారు 250 తమిళ సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయని.. వాటిలో మెజారిటీ సినిమాలకు పెట్టిన పెట్టుబడిలో సగం కూడా తిరిగి రావడం లేదని నిర్మాతల మండలి చెబుతోంది.. దీనివల్ల ఏటా 700 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వస్తున్నాయని వెల్లడించింది.. ఇలాంటి పరిస్థితుల్లో 8 వారాల ఓటీటీ నిబంధన అమలు చేస్తే నిర్మాతల డిజిటల్ హక్కుల ఆదాయంపై మరింత ప్రభావం పడుతుందని నిర్మాతలు వాదిస్తున్నారు.. మరోవైపు.. సినిమాలు త్వరగా ఓటీటీలోకి వెళ్లడం వల్ల థియేటర్ బిజినెస్ దెబ్బతింటోందన్నది ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల వాదన.. దీంతో థియేటర్ బిజినెస్‌ను కాపాడాలా.. నిర్మాతల డిజిటల్ ఆదాయాన్ని కాపాడాలా అన్న అంశంపై కోలీవుడ్‌లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది..
ఈ వివాదాన్ని వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి.. రాష్ట్ర ప్రభుత్వం జోక్యంతో సమస్యకు పరిష్కారం కనుగొనాలని నిర్మాతల సంఘాలు నిర్ణయించాయి.. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి ఈ వివాదం పరిష్కారం కాకపోతే.. కొత్త సినిమాల విడుదలతో పాటు షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిలిచిపోవడంతో తమిళ సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితి కనిపిస్తోంది.. మొత్తంగా చూస్తే ఓటీటీ విండోపై నిర్మాతలు–థియేటర్ యజమానుల మధ్య పోరు కీలక దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. 8 వారాల ఓటీటీ విండోపై ఏకాభిప్రాయం కుదరకపోతే కోలీవుడ్‌లో సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉంది. ఈ వివాదానికి ఇరు వర్గాలు ఎలాంటి పరిష్కారం కనుగొంటాయన్నది ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది.

