Koffee With Karan: రెండు దశాబ్దాలకు పైగా భారతీయ టెలివిజన్ రంగాన్ని ఊపేసిన సంచలన టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ ఇక చరిత్రగా మిగిలిపోనుంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా అలరించిన ఈ షోకు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ షో ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. “2004లో ఈ సెలబ్రిటీ టాక్ షో ఆలోచనను మా నాన్నతో పంచుకున్నప్పుడు ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి నిధులు ఎలా సమకూరుతాయని అడిగారు. దురదృష్టవశాత్తూ అదే నెలలో ఆయన కన్నుమూశారు. ఆయనతో మాట్లాడిన చివరి ప్రాజెక్ట్ ఇదే. కొన్ని అనుబంధాలు ఎప్పటికీ ముగిసిపోకూడదని మనం కోరుకుంటాం, కానీ తప్పనిసరిగా ఆపే టైం వస్తుంది. వివాదాలు ఎన్ని చుట్టుముట్టినా ప్రేక్షకులు అందించిన రెస్పాన్స్ మరువలేనిది” అంటూ కరణ్ భావోద్వేగానికి లోనయ్యారు.
ఇప్పటి వరకు విజయవంతంగా 8 సీజన్లు, 161 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ షో.. తొమ్మిదో సీజన్‌తో తన సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించనుంది. జియో హాట్‌స్టార్ వేదికగా అక్టోబర్ 14 నుండి ఈ చివరి సీజన్ స్ట్రీమింగ్ కానున్నట్లు కరణ్ స్పష్టం చేశారు. ముగింపు ఘట్టం కావడంతో ఈసారి షోను మరింత గ్రాండ్‌గా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లలో టాలీవుడ్ దిగ్గజాలు ప్రభాస్, ఎస్.ఎస్.రాజమౌళి, రానా, సమంత, విజయ్ దేవరకొండ వంటి తారలు హాజరై పలు వ్యక్తిగత, వృత్తిపరమైన ఆసక్తికర విషయాలను పంచుకుని షోను మరింత ఆకర్షణీయంగా మార్చారు. ఇక చివరి సీజన్‌ను అద్భుతంగా ముగించేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే బాలీవుడ్ అగ్ర త్రయం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లు కూడా ఈ వీడ్కోలు సీజన్‌లో భాగం కానున్నట్లు సమాచారం. సినీ ప్రేమికులకు, సెలబ్రిటీ గాసిప్స్ ఇష్టపడే అభిమానులకు తీరని లోటే అయినప్పటికీ, చివరి సీజన్‌లో రాబోయే అతిథుల సందడి ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

