M. M. Keeravani: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి బాణీలు ఆయన తమ్ముడు ఎస్.ఎస్.రాజమౌళికి తప్ప ఇతరులకు ఇప్పుడు కలసి రావడం లేదు అనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే తన దరికి చేరిన ప్రతీ చిత్రాన్ని తొలి సినిమాగా భావించి బాణీలు కడుతూ ఉంటారు కీరవాణి. ఎవరు ఏమనుకున్నా, నందమూరి ఫ్యామిలీలో తండ్రులకు, కొడుకులకు అచ్చివచ్చిన సంగీత దర్శకునిగా కీరవాణి నిలచిపోయారు. తాజాగా కళ్యాణ్ రామ్ ‘బింబిసార’కు మ్యూజిక్ అందించారు కీరవాణి. ఆ సినిమా ప్రస్తుతం హిట్ టాక్ తో సాగిపోతోంది. ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యామిలీకి కీరవాణి సంగీతానికి ఉన్న అనుబంధం పరిశీలిస్తే- ఇద్దరు తండ్రులకు, నలుగురు కొడుకులకు ఆయన బాణీలు భలేగా పనిచేశాయని తెలుస్తోంది.
నందమూరి ఫ్యామిలీలో తొలుత యన్టీఆర్ ‘మేజర్ చంద్రకాంత్’కు కీరవాణి బాణీలు కట్టారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న సంగతి చెప్పవలసిన పనిలేదు. యన్టీఆర్ తనయుల్లో బాలకృష్ణకు కీరవాణి బాణీలు కట్టిన చిత్రాల్లో ‘బొబ్బిలి సింహం’ బంపర్ హిట్. తరువాత యన్టీఆర్ మరో తనయుడు హరికృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ కూడా సిల్వర్ జూబ్లీ హిట్. ఇక హరికృష్ణ తనయుల్లో జూ.యన్టీఆర్ కు కీరవాణి స్వరాలు సమకూర్చిన చిత్రాల్లో “స్టూడెంట్ నంబర్ వన్, సింహాద్రి, యమదొంగ” ఎలాంటి హిట్సో చెప్పక్కర్లేదు. ఇప్పుడు హరికృష్ణ మరో తనయుడు కళ్యాణ్ రామ్ కు ‘బింబిసార’తో తొలిసారి స్వరకల్పన చేసి, హిట్ ను చూపించారు కీరవాణి. ఆ తీరున నందమూరి ఫ్యామిలీలో ఇద్దరు తండ్రులు, నలుగురు కుమారులకు కీరవాణి బాణీలు ఘనవిజయాన్ని అందించాయని చెప్పవచ్చు.
అన్నట్టు నందమూరి ఫ్యామిలీ హీరో అయిన తారకరత్న నటించిన ‘ఒకటో నంబర్ కుర్రాడు, యువరత్న” చిత్రాలకు కూడా కీరవాణి వినసొంపైన సంగీతం అందించారు. కానీ, ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి. పైగా తారకరత్న తండ్రి నందమూరి మోహనకృష్ణ సినిమాటోగ్రాఫర్ కానీ, సినీయాక్టర్ కాదు అన్న విషయం గమనార్హం!
