Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్‌బంప్స్ స్పీచ్!

Kasarla Shyam

Kasarla Shyam

Kasarla Shyam: న్యాచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ చేసిన భావోద్వేగ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ‘దసరా’ నుంచి శ్రీకాంత్ ఓదెలతో మొదలైన తన అనుబంధం ఈ చిత్రంతో మరింత బలపడిందని చెబుతూ, సినిమాలో నాని నటన, శ్రీకాంత్ డైరెక్షన్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో వివరిస్తూ వేదికపై ఇచ్చిన ఎలివేషన్లు అభిమానుల్లో గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సినిమాటిక్ విజన్ గురించి కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. “శ్రీకాంత్ నాకు కథ, ‘జడల్’ అనే క్యారెక్టర్, ఆ ప్యారడైజ్ ప్రపంచం గురించి చెబుతుంటే నా బుర్రలోకి ఇప్పసారాయి ఎక్కించినట్లు అయిపోయింది. ఈ సినిమాలో నాని ట్రాన్స్‌ఫార్మేషన్, ఆయన పడ్డ కష్టం చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ ఆవేశంలోంచే ‘ఆయా షేర్’ అనే పాట పుట్టింది. మొదట ‘నన్ను చంపుతావా’ అని రాస్తే.. శ్రీకాంత్ వద్దని, ‘నన్ను వీకుతావా’ అని మార్పించాడు. కథపై తన పట్టు, కసి అలాంటిది” అని గుర్తుచేసుకున్నారు.

సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ‘ఏషనాగుల’ పాట వెనుక ఉన్న కథను కూడా ఆయన పంచుకున్నారు. “ఈ రోజుల్లో ఐటెం సాంగ్స్ అంటే అశ్లీలత ఎక్కువైంది. కానీ ఎక్కడా బూతు లేకుండా, ఒక స్వచ్ఛమైన మొరటు ప్రేమను ఆవిష్కరించాలన్న ఉద్దేశంతోనే ఈ పాట రాశాం. దాదాపు 35 ఏళ్లుగా కోలాటాల్లో పాడుతున్న జంగిరెడ్డి గారి జానపద బాణీని హుక్ లైన్‌గా వాడుకున్నాం. ఆ పాలమూరు జానపద కళాకారుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేం” అంటూ వివరించారు. సంగీత సంచలనం అనిరుద్ గురించి మాట్లాడుతూ.. అంత పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ తనను ‘సార్’ అని పిలవద్దని, ‘అని’ అని పిలవమంటూ ఎంతో గౌరవం ఇచ్చాడని శ్యామ్ ప్రశంసించారు. తెలంగాణ నేటివిటీని గట్టిగా పట్టుకుని అనిరుద్ ఇచ్చిన ఆర్ఆర్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని, సినిమాలో మదర్-సన్ సెంటిమెంట్‌పై నాలుగు అద్భుతమైన బిట్ సాంగ్స్ కూడా రాశానని వెల్లడించారు.

నాని పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ స్టేజీపై కాసర్ల శ్యామ్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ సభికులను ఉర్రూతలూగించింది. “నాని అన్న యాక్టింగ్ చూసి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థియేటర్లలో ఉడికిపోతాం. ఆడిటోరియం డాన్స్ ఫ్లోర్‌లా ఎలా మారిందో, రిలీజ్ రోజున సినిమా హాళ్లు కూడా అలానే మారబోతున్నాయి. ఎందుకంటే.. ‘ఇది నెత్తుటి గింజల పైన మొలిసిన రాజ్యం.. గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం! ఎండిపోయిన బొక్కలే ఎగిరే జెండ కర్రలు.. మాడిపోయిన డొక్కలే మోగేటి నగారాలు!’ ఈ సవారీల కథను చదివితే పుస్తకానికే పూనకం వస్తుంది.. వాళ్ల సప్పుడు వింటే చరిత్రే దర్వాజా తీస్తుంది” అంటూ ఆయన చెప్పిన మాటలు సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. సెప్టెంబర్ 24న థియేటర్లు జాతరగా మారడం ఖాయమని శ్యామ్ ధీమా వ్యక్తం చేశారు.