Site icon NTV Telugu

Manchu Brothers: కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్సింగ్ వెనుక ‘చరిత’.. ఆమెకు మనోజ్ థాంక్స్?

Manchu Manoj Vs Manchu Vishnu

Manchu Manoj Vs Manchu Vishnu

టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’ తాజాగా ఒక అనూహ్య సంఘటనతో వార్తల్లో నిలిచింది. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని కీలక వీఎఫ్ఎక్స్ డేటా మరియు ఒక ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ఉన్న హార్డ్ డిస్క్ చోరీ అయినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మంచు విష్ణు నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ ఘటనకు కారణమైన చరిత అనే మహిళపై విష్ణు ఆరోపణలు చేస్తుండగా, రెండు రోజుల క్రితం జరిగిన ‘భైరవం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మంచు మనోజ్ చరిత అనే మహిళను ప్రశంసించడం సంచలనంగా మారింది. ఈ రెండు సంఘటనల్లో చరిత ఒకే వ్యక్తినా, లేక వేర్వేరు వ్యక్తులా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా నిలిచింది.

ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుండి హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉన్న 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కార్యాలయానికి డీటీడీసీ కొరియర్ ద్వారా పంపిన హార్డ్ డిస్క్‌లో ‘కన్నప్ప’ చిత్రానికి సంబంధించిన కీలకమైన వీఎఫ్ఎక్స్ డేటా, రెండు ప్రధాన పాత్రల మధ్య జరిగే ఒక ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హార్డ్ డిస్క్‌ను రఘు అనే వ్యక్తి స్వీకరించి, చరిత అనే మహిళకు అప్పగించాడు. అయితే, చరిత ఆ తర్వాత అదృశ్యమైందని, హార్డ్ డిస్క్ కూడా ఆమెతో పాటు మాయమైనట్లు నిర్మాణ సంస్థ ఆరోపిస్తోంది. ఈ ఘటనను గుర్తించిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రెడ్డి విజయ్ కుమార్, ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు. రఘు, చరితలు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి ఉద్యోగులు కానప్పటికీ, చోరీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

చరిత ఎవరు?
ఈ ఘటనకు రెండు రోజుల ముందు, మంచు మనోజ్ నటిస్తున్న ‘భైరవం’ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చరిత అనే మహిళను ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “చరిత, థాంక్స్ అమ్మా. ఒక ఆడదానివి అయినా, ఒక మొగోళ్ళు సిగ్గుపడేలాగా నీ నీతి, నిజాయితీ ఏంటో చూపించావ్. మీ అందరికీ నేనుంటాను లైఫ్ లాంగ్,” అని మనోజ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో సంచలనం రేపాయి. విష్ణు ఆరోపిస్తున్న చరిత, మనోజ్ ప్రశంసించిన చరిత ఒకే వ్యక్తినా అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ తికమక పెడుతోంది. మంచు కుటుంబంలో విష్ణు, మనోజ్ మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ ఘటనతో ఆ విభేదాలు మరింత ఉద్ధృతమయ్యాయి. విష్ణు క్యాంపు నుండి మనోజ్‌పై ఆరోపణలు వస్తుండగా, మనోజ్ అభిమానులు ఈ హార్డ్ డిస్క్ చోరీ వెనుక విష్ణు డ్రామా ఉందని అనుమానిస్తున్నారు.

Exit mobile version