కన్నడ ప్రముఖ నటుడు దర్శన్, ప్రస్తుతం రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పరప్పన అగ్రహార జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. అయితే, జైలులో ఆయనకు నరకం చూపిస్తున్నారని, ఉగ్రవాదులను ఉంచే హై-సెక్యూరిటీ సెల్లో ఒంటరిగా బంధించారని ఆయన తరపు న్యాయవాది కోర్టులో తీవ్ర వాదనలు వినిపించారు. హత్య కేసులో అరెస్టయిన దర్శన్‌ను జైలు అధికారులు అత్యంత కఠినంగా చూస్తున్నారని ఆయన లాయర్ సివిల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇతర ఖైదీలతో కలవకుండా, మానసికంగా వేధించే ఉద్దేశంతో ఉగ్రవాదులను ఉంచే సెల్లో ఏకాంత నిర్బంధంలో ఉంచారని ఆరోపించారు. ఇది ఖైదీల హక్కులను పూర్తిగా ఉల్లంఘించడమేనని అన్నారు.
Also Read:Bihar SIR: సర్ తర్వాత, బీహార్ తుది ఓటర్ జాబితా రిలీజ్..
జైలులో దర్శన్‌కు కనీస సౌకర్యాలైన పరుపు, దిండు కూడా అందించలేదని లాయర్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం శుభ్రమైనవి కాకుండా, ఇతరులు వాడి పడేసిన పరుపు, దిండును ఇవ్వడంతో దర్శన్‌కు తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకిందని కోర్టుకు తెలిపారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, వెంటనే మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. దర్శన్ తరపు న్యాయవాది వాదనలను విన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాటిని వ్యతిరేకించారు. దర్శన్ ఒక హై-ప్రొఫైల్ ఖైదీ అని, ఆయన భద్రత దృష్ట్యానే ప్రత్యేక సెల్లో ఉంచాల్సి వచ్చిందని తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న సివిల్ కోర్టు, తదుపరి విచారణను అక్టోబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు దర్శన్ అదే సెల్లో కొనసాగనున్నారు. రేణుకాస్వామి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేసిన కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు ప్రస్తుతం కర్ణాటకలో సంచలనం సృష్టిస్తోంది.