పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జయ కేతనం ఎగరేసిన నేపథ్యంలో పలు నియోజక వర్గాలలో హింస చెలరేగింది. బీజేపీ, ఏబీవీపీ కార్యాలయాలను ధ్వంసం చేయడంతో పాటు కొన్ని చోట్ల టీసిఎం కార్యకర్తలు వాటిని తగలబెట్టే ప్రయత్నం చేశారు. అడ్డుకోబోయిన బీజేపీ కార్యకర్తలు, పోలీసులపై దాడి చేశారు. బీజేపీ సానుభూతి పరుల దుకాణాలను కొన్ని చోట్ల లూఠీ చేశారు. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తీవ్రంగా విమర్శిస్తూ ట్విట్టర్ వేదికగా దాడికి దిగింది. తాను ఆమెను గతంలో రావణాసుడితో పోల్చానని కానీ రావణుడు గొప్ప పరిపాలనాధికారి, విద్వాంసుడు, జ్ఞానవంతుడు అని చెబుతూ, ఈమె రక్తపిశాచి అని మమతను విమర్శించింది. అంతేకాదు. ఆమెకు ఓటు వేసిన వారందరికీ ఆ రక్తపు మరకలు అంటుకుంటాయని తెలిపింది. కంగనా రనౌత్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ట్విట్టర్ నిర్వాహకులు ఆమె అక్కౌంట్ ను సస్పెండ్ చేశారు. అయితే… దీనిని కూడా కంగనా ఖండించింది. ట్విట్టర్ సంస్థ వర్ణ వివక్షను చూపుతోందని, తన మనోభావాలను కట్టడి చేస్తోందని ఆరోపించింది. ఆ సంస్థ తనను నిలువరించినా, వేరే మాధ్యమాల ద్వారా తన భావాలు, కళను ప్రజలకు తెలియచేస్తానని కంగనా అంటోంది. గత రెండు రోజులుగా బీజేపీ అనుబంధం సంస్థలు, నెటిజన్లు బెంగాల్ బర్నింగ్, బెంగాల్ వయొలెన్స్ అనే హ్యాష్ ట్యాగ్స్ తో అక్కడ జరుగుతున్న దాడిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారం చినికి చినికి గాలీవానగా మారేట్టుగా కనిపిస్తోంది.