టాలీవుడ్‌లో ప్రతిభకు కొదవ లేదు, కానీ ఆ ప్రతిభను గుర్తించి వెండితెర వరకు తీసుకొచ్చే అవకాశాలే తక్కువ. ఈ లోటును భర్తీ చేస్తూ, కొత్త రక్తాన్ని ఎంకరేజ్ చేసే లక్ష్యంతో ఓ ఎన్నారై నిర్మాతగా సరికొత్త అడుగు వేశారు. ఎన్నారై కళ్యాణ్ ‘కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్’ పేరుతో ఒక నిర్మాణ సంస్థను ఆయన ప్రారంభించారు. నేటి సినిమాల్లో హీరోల కంటే కథలకే ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ క్రమంలో అలంటి సినిమాలను చేయాలనే ఉద్దేశంతో నిర్మాత కళ్యాణ్, తన బ్యానర్‌లో రాబోయే చిత్రాల్లో “కథే హీరో” అని స్పష్టం చేశారు. కొత్త దర్శకులు, వినూత్న ఆలోచనలు ఉన్న సాంకేతిక నిపుణులు, మరియు వెండితెరపై మెరవాలనుకునే నూతన నటీనటులకు ఈ బ్యానర్ ఒక సరైన వేదిక కానుందని అన్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొత్త వారికి అవకాశాలు దొరకడం గగనంగా మారుతున్న తరుణంలో, కేవలం కంటెంట్ నమ్ముకుని వచ్చే వారి కోసం ఈ నిర్మాణ సంస్థను స్థాపించినట్లు కళ్యాణ్ తెలిపారు. ఇక కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా, ప్రేక్షకులను ఆలోచింపజేసే, సమకాలీన అంశాలపై స్పందించే ప్రయోగాత్మక చిత్రాలకు కూడా కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పెద్ద పీట వేయనుంది. క్రియేటివిటీకి పూర్తి స్వేచ్ఛనిస్తూ, టెక్నాలజీ పరంగా రాజీ పడకుండా సినిమాలను నిర్మించడమే తమ సంకల్పమని ఆయన వెల్లడించారు. ఈ బ్యానర్ నుంచి రాబోయే ప్రాజెక్టుల కోసం ఇప్పటికే కసరత్తులు పూర్తయ్యాయి. కొన్ని క్రేజీ స్క్రిప్ట్స్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయి. ఈ నిర్మాణ సంస్థ నుంచి రాబోయే తొలి సినిమా వివరాలను సంక్రాంతి పండుగ కానుకగా ప్రకటించనున్నారు. అదే రోజున సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.