మారుతున్న సినీ సమీకరణాల్లో ఒక చిన్న సినిమాను నిర్మించడం కంటే, దాన్ని థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే అత్యంత కష్టమైన సవాల్ అని కుండబద్దలు కొట్టారు హీరో వర్ధన్. కాలువలో సాఫీగా సాగిపోతుందనుకున్న తమ ‘కాగితం పడవలు’ ప్రయాణం, ఊహించని విధంగా సముద్రంలోకి వెళ్లిపోయిందని, ఎన్నోసార్లు ఒడ్డుకు చేరుకోవాలని ప్రయత్నించినా కుదరలేదని ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. వర్ధన్, కృష్ణప్రియ జంటగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ‘కాగితం పడవలు’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర బృందం పంచుకున్న ఆసక్తికర విషయాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
కంటెంట్ పట్ల ఉన్న నమ్మకంతో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి అగ్ర పంపిణీ సంస్థ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకువస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలో దాగి ఉండే ఒక స్వచ్ఛమైన ప్రేమకథను గుర్తుచేసేలా దర్శకుడు తుకారాం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఈ సినిమాకి అసలైన హీరోలు తమ నిర్మాతలేనని, వారు లేకపోతే తమ పడవ ఇంత దూరం ప్రయాణించేది కాదని స్పష్టం చేశారు. థియేటర్‌కు వచ్చే ప్రతి ప్రేక్షకుడికి తమ సొంత ప్రేమకథ కచ్చితంగా గుర్తుకొస్తుందని ఆయన హామీ ఇచ్చారు. తెలుగులో తనకు ఇది రెండో సినిమా అని, ఎంతో ప్యాషన్‌తో దర్శకుడు తీసిన ఈ చిత్రంలో తన పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని హీరోయిన్ కృష్ణప్రియ ధీమా వ్యక్తం చేశారు. కంటెంట్ బాగున్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారని, తమ సినిమా కూడా ఆ కోవలోనే పెద్ద విజయం సాధిస్తుందని సినిమాటోగ్రాఫర్ రుద్ర సాయి, నిర్మాత అంజనప్ప నమ్మకం వ్యక్తం చేశారు.

