‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ఎన్నికల తేదీ ప్రకటన రాకముందే… ఫిల్మ్ నగర్ లో వాతావరణం వేడెక్కింది. ఎన్ని ప్యానెల్స్ పోటీ పడతాయో తెలియదు కానీ అధ్యక్ష పదవికైతే ఐదారుగురు పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనిపిస్తోంది. ఇదిలా ఉంటే… సినిమా రంగంలోని ప్రముఖులు సైతం ఇప్పుడిప్పుడే తమ అభిప్రాయాలను తెలియచేస్తున్నారు. తాజాగా చిత్రపురి హౌసింగ్ సొసైటీలో కీలక బాధ్యతలను నెరవేర్చుతున్న కాదంబరి కిరణ్ సైతం దీనిపై పెదవి విప్పారు. ప్రస్తుతం ఆయన ఆర్టిస్టుగానే కాకుండా సమాజ సేవా కార్యక్రమాలతోనూ బిజీగా ఉంటున్నారు. ‘మనం సైతం’ పేరుతో ఓ సేవా సంస్థను ఏర్పాటు చేసి ఆపన్నులను ఆదుకుంటున్నారు.
Read Also : మెగా కజిన్స్ సెల్ఫీ వైరల్
తాజాగా ‘మా’ ఎన్నికలపై కాదంబరి కిరణ్ కుమార్ స్పందిస్తూ, ‘సినిమా రంగానికి చెందిన పెద్దలంతా కూర్చుని ప్యానెల్స్ గొడవ లేకుండా ఏకగ్రీవంగా ఓ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఛాంబర్ సలహా సంప్రదింపులతోనే ‘మా’ నడుస్తుంది. అయినప్పుటికీ అది స్వతంత్రం గా నిర్ణయాలు తీసుకునే ఓ సంస్థ. దానికి సినిమా రంగంలోని ఏ ఇతర అసోసియేషన్స్ లతోనూ సంబంధం ఉండదు. దేని గొడుగుకు కిందకూ ‘మా’ రాదు. అలాంటి ‘మా’ ఎన్నికల్లో ఫెడరేషన్, చిత్రపురి హౌసింగ్ సొసైటీ, టీవీ ఆర్టిస్టుల అసోసియేషన్ కార్యవర్గాలలో ఉన్నవారు పోటీ చేయకూడదని చెప్పడం అర్థం లేనిది. అది కుంచిత, సంకుచిత మనస్తత్వంకు నిదర్శనం. అలా అనుకునేప్పుడు టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో ఉన్నవారికి అసలు ‘మా’లో సభ్యత్వమే ఇవ్వకుండా ఉండాల్సింది. ఈ విషయంలోనూ పెద్దలు, సీనియర్ నటులు ఆలోచించి, ఓ నిర్ణయం తీసుకోవాలి” అని అన్నారు.