Aakasamlo Oka Tara: నా వాళ్లు ఉన్న సినిమా.. ‘ఆకాశంలో ఒక తార’పై తారక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

Jr Ntr Emotional Post Aakasamlo Oka Tara

Jr Ntr Emotional Post Aakasamlo Oka Tara

Aakasamlo Oka Tara: సాధారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాల అప్‌డేట్స్ లేదా అరుదుగా ఇతర హీరోల సినిమాల గురించి సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. కానీ ఒక సినిమా రిలీజ్‌కు ముందు ఆయన ప్రత్యేకంగా స్పందించి, అందులో తనకు ఎంతో ఆత్మీయులు ఉన్నారని ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా నేడు (నవంబర్ 20) థియేటర్లలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్ తన పోస్ట్‌లో ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. దానికి ప్రధాన కారణం ఈ ప్రాజెక్ట్ వెనుక తనకు ఎంతో సన్నిహితులైన వ్యక్తులు ఉండటమే. ముఖ్యంగా నిర్మాతలు సందీప్ (సన్నీ) గున్నం, రమ్య గున్నం ఈ సినిమా మొదలైనప్పటి నుంచి దీన్ని ఒక కలలా భావించి ఎంత కష్టపడ్డారో తనకు వ్యక్తిగతంగా తెలుసని తారక్ చెప్పుకొచ్చారు. సన్నిహితుల కష్టాన్ని గుర్తిస్తూ ఎన్టీఆర్ రాసుకొచ్చిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కేవలం నిర్మాతలనే కాకుండా, ఈ సినిమాను సమర్పిస్తున్న రెండు దిగ్గజ సంస్థల గురించి కూడా ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ కొత్తదనాన్ని, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో స్వప్న దత్ (స్వప్న సినిమాస్) ముందుంటారని కొనియాడారు. అలాగే అల్లు అరవింద్ గారు, గీతా ఆర్ట్స్ సంస్థ మంచి సినిమాలపై పెట్టే నమ్మకం ఎప్పుడూ వమ్ము కాదని ప్రశంసించారు. ఈ రెండు బ్యానర్లు ఒకే సినిమా కోసం చేతులు కలపడం విశేషం.

పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తుంటే సినిమా చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తోందని తారక్ అభిప్రాయపడ్డారు. హీరో దుల్కర్, దర్శకుడు పవన్ సాధినేని, హీరోయిన్ సాత్వికతో పాటు చిత్ర బృందం మొత్తానికి ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. మొత్తానికి రిలీజ్‌కు ముందే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో నుంచి ఇలాంటి పర్సనల్ టచ్ ఉన్న సపోర్ట్ రావడంతో ‘ఆకాశంలో ఒక తార’పై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. మరి నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.