ప్రముఖ హాలీవుడ్ నటుడు జోక్విన్ ఫీనిక్స్ నటించిన ‘జోకర్’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ చిత్రంలో జోక్విన్ ఫీనిక్స్ నటనకు అంతా ఫిదా అయ్యారు. అంతేకాదు ఈ చిత్రనికిగానూ ఉత్తమ నటుడిగా తన మొదటి ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నాడు జోక్విన్ ఫీనిక్స్. అన్ని భాషల్లోనూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘జోకర్’కు సీక్వెల్ రాబోతోంది. ప్రస్తుతం ‘జోకర్’ సీక్వెల్ కు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రసిద్ధ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ వారు ధృవీకరించారు. దీంతో అప్పుడే సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. ఇంకా ఈ సీక్వెల్ కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించిన ‘జోకర్’ ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. అకాడమీ అవార్డులలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో కూడా నామినేషన్లలో నిలిచింది. ఇప్పుడు సీక్వెల్ కూడా జోక్విన్ ఫీనిక్స్ హీరోగా టాడ్ ఫిలిప్స్ దర్శకత్వంలో తెరకెక్కనుందని సమాచారం. ఇక సూపర్ హీరో బాట్మాన్ కు ‘జోకర్’ ఐకానిక్ డిసి విలన్ అన్న విషయం తెలిసిందే.