హాలీవుడ్ తారల పెళ్లిల్ల కంటే విడాకులే ఎక్కువ పబ్లిసిటీకి నోచుకుంటాయి! ఇది ఎప్పుడూ జరిగేదే! అయితే, యాంబర్ హర్డ్ గొడవ మాత్రం ఆమె తన భర్త జానీ డెప్ నుంచీ విడిపోయాక కూడా కొనసాగుతూనే ఉంది. ఆన్ లైన్ లో జనం హాలీవుడ్ మాజీ జంట కోసం రెండుగా విడిపోయి కొట్టుకుంటున్నారు! అప్పుడెప్పుడో పెళ్లాడి, తరువాత విడిపోయి, ఆ తరువాత కోర్టులో పరువు నష్టం దావాలతో నిత్యం న్యూస్ లో నిలుస్తున్నారు మిష్టర్ అండ్ మిస్ జానీ డెప్ అండ్ యాంబర్ హర్డ్…
హాలీవుడ్ బ్యూటీ యాంబర్ హర్డ్ జానీ డెప్ ని పెళ్లాడింది.
అయితే, చాలా మంది వెస్ట్రన్ బ్యూటీస్ లాగే… ఆమె కూడా… మందు తాగి, డ్రగ్స్ తీసుకుని భర్త తనని కొడుతున్నాడని, మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. కోర్టు తీర్పుతో జానీ డెప్ భారీ మొత్తం చెల్లించి విడాకులు తీసుకున్నాడు. అయితే, ఆ తరువాత ఆయన గురించి, ఆయన పెట్టిన హింస గురించి యాంబర్ హర్డ్ ఓ పత్రికలో వ్యాసం రాసింది. దాంతో ఆయన పరువు నష్టం కేసులు వేశాడు. ఇంగ్లాండ్ కోర్టు ఇప్పటికే డెప్ కి వ్యతిరేకంగా తీర్పునివ్వగా అమెరికన్ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది.
చాలా గృహ హింస కేసుల్లో జరిగినట్టే జానీ డెప్ వివాదంలోనూ మొదట్లో అందరూ యాంబర్ కి సపోర్ట్ చేశారు. కానీ, తరువాత హాలీవుడ్ స్టార్ హీరో కూడా భార్య తనని హింసించిందని, భౌతిక దాడులు చేసిందని కోర్టులో వివరించాడు. అప్పట్నుంచీ యాంబర్ పై కూడా ఉద్యమం మొదలైంది. జానీ డెప్ లాగే ఆమెని కూడా సినిమాల్లోంచి బహిష్కరించాలని నెటిజన్స్ అంటున్నారు. కొందరు మాత్రం జానీ డెప్ దే తప్పు అంటుంటే… మరికొందరు ఇద్దరిదీ తప్పు అంటున్నారు. ఇక కొందరు జానీ డెప్ డైహార్డ్ ఫ్యాన్స్ యాంబర్ దే తప్పంతా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు…
జానీ డెప్, యాంబర్ హర్డ్ వివాదం కొనసాగుతుండగానే ఈ మధ్య ‘ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్ డమ్’ సినిమా అనౌన్స్ చేశారు. అందులో సదరు సినిమా నిర్మాణ సంస్థ యాంబర్ ను కొనసాగించింది. కానీ, అదే బ్యానర్ లో రూపొందుతోన్న ‘ఫెంటాస్టిక్ బీస్ట్స్’ నుంచీ జానీ డెప్ ను గృహ హింస ఆరోపణలపై తొలగించింది! ఈ పరిణామంతో యాంబర్ ను టార్గెట్ చేస్తోన్న వర్గం ‘జస్టిస్ ఫర్ జానీ డెప్’ హ్యాష్ ట్యాగ్ ను రన్ చేసింది. పోయిన సంవత్సరం కూడా ఈ హ్యాష్ ట్యాగ్ సొషల్ మీడియాలో ఉధృతంగా చెలామణి అయింది! ఇప్పుడు మరోసారి జానీడెప్ కి న్యాయం కావాలంటూ నెటిజన్స్ నోళ్లు తెరుస్తున్నారు. ప్రస్తుతానికైతే ‘ఆక్వామాన్’ మూవీ నిర్మాణ సంస్థ యాంబర్ వైపునే నిబడ్డట్టు కనిపిస్తోంది. నెటిజన్ల ‘బాయ్ కాట్ ఆక్వామాన్’ బెదిరింపులకి లొంగటం లేదు. యాంబర్ తోనే తమ సినిమా రూపొందుతోందని తెగేసి చెబుతోంది! చూడాలి మరి, హాలీవుడ్ మాజీ కపుల్ రచ్చ సొషల్ మీడియాలో ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో…