Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్

Jason Sanjay (2)

Jason Sanjay (2)

Jason Sanjay: తమిళ స్టార్ హీరో, సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్ టాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సిగ్మా’ (#SIGMA) ద్వారా దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేస్తున్న సంజయ్.. తొలిసారి తన వ్యక్తిగత విషయాలు, భవిష్యత్ ప్లాన్స్‌పై ఓపెన్ అయ్యారు. తన తండ్రి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు, ముఖ్యంగా వెండితెరపై హీరోగా అరంగేట్రం చేసే అంశంపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ‘సిగ్మా’ సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా మీడియా ప్రతినిధులు సంజయ్‌ను పలకరిస్తూ.. “మీ నాన్నగారు సీఎం అయిన క్షణంలో దేశమంతా ఒక్కసారిగా షాక్ అయింది.. ఆ వార్త తెలిసినప్పుడు మీ మొదటి రియాక్షన్ ఏంటి?” అని ప్రశ్నించారు. దీనికి సంజయ్ చిరునవ్వుతో స్పందిస్తూ.. “ఆ విషయం తెలిసిన వెంటనే నేను చాలా చాలా సంతోషపడ్డాను. నాకే కాదు, ఆయన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ అది అత్యంత ఆనందకరమైన అద్భుత క్షణం” అంటూ తన మనసులోని సంతోషాన్ని పంచుకున్నారు.

ఈవెంట్‌లో సంజయ్ స్టేజ్ పైకి రాగానే అక్కడున్న ప్రేక్షకులు, అభిమానులు ‘హీరో.. హీరో’ అంటూ హోరెత్తించారు. తెరవెనుక మెగాఫోన్ పట్టిన సంజయ్‌ను తెరముందు హీరోగా చూడాలన్న కోరికను వ్యక్తపరిచారు. ఇదే విషయాన్ని మీడియా ప్రస్తావిస్తూ.. “భవిష్యత్తులో మీరు హీరోగా నటించే అవకాశం ఏమైనా ఉందా?” అని అడగ్గా, సంజయ్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. హీరోగా ఎంట్రీ ఇచ్చే విషయాన్ని ఆయన ఏమాత్రం కొట్టిపారేయలేదు. పైగా చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతూ.. “ప్రస్తుతం నా దృష్టంతా నా ‘సిగ్మా’ రిలీజ్‌పైనే ఉంది. ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చిన తర్వాత.. కచ్చితంగా యాక్టింగ్ వైపు అడుగులు వేసే విషయాన్ని పరిశీలిస్తాను. నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్” అని అన్నారు. సంజయ్ ఈ మాట చెప్పగానే ఆడిటోరియం మొత్తం చప్పట్లు, ఈలలతో మార్మోగిపోయింది. దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పటికీ, తనలో ఒక నటుడు కూడా ఉన్నాడని సంజయ్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లయింది. తన తండ్రి విజయ్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని వెండితెరపైకి జాసన్ ఎప్పుడెప్పుడు వస్తారు అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా తీపి కబురే. ప్రస్తుతం సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘సిగ్మా’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరి డైరెక్షన్‌లో సంజయ్ హీరోగా సినిమా మొదలు పెడతారనే దానిపై అప్పుడే ఆసక్తికరమైన చర్చ మొదలైంది.