Telugu Film Federation: జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ ఊహించని షాక్.. మళ్లీ సస్పెన్షన్ వేటు!

Jani Master Ban

Jani Master Ban

తెలుగు చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ చుట్టూ వివాదం మళ్లీ రాజుకుంది. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో చెలరేగిన అంతర్గత విభేదాలు, జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ వివాదం నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎత్తివేసిన జానీ మాస్టర్ సస్పెన్షన్‌ను మళ్లీ యథావిధిగా పునరుద్ధరిస్తున్నట్లు ఫెడరేషన్ అధికారికంగా ప్రకటించింది. డ్యాన్సర్స్ యూనియన్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించేందుకు ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని నేతృత్వంలో మిగతా 23 క్రాఫ్ట్స్ ప్రతినిధులతో అత్యవసర జనరల్ కౌన్సిల్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో జానీ మాస్టర్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.

గతంలో ఫెడరేషన్‌తో కలిసి నడుస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి, తిరిగి ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అనిల్ వల్లభనేని స్పష్టం చేశారు. అంతేకాకుండా, మెగాస్టార్ చిరంజీవి, నిర్మాతల మండలి వంటి పెద్దల మాటలను తోసిపుచ్చి డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత ఏకపక్షంగా నిర్వహించిన ఉపఎన్నికలను ఫెడరేషన్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆ ఎన్నికల ద్వారా ఏర్పడిన నూతన కార్యవర్గానికి ఎటువంటి సహకారం అందించబోమని, అయితే సాధారణ డ్యాన్సర్లు ఫెడరేషన్‌ను ఆశ్రయిస్తే మాత్రం వారికి పూర్తి మద్దతు ఇస్తామని స్పష్టం చేసింది. తాజా సస్పెన్షన్ నిర్ణయంతో జానీ మాస్టర్ భవిష్యత్ కార్యాచరణ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.