సౌత్ సినిమాలపై బాలీవుడ్ బడా స్టార్స్ మోజు రోజురోజుకు పెరుగుతోందేగానీ… తగ్గటం లేదు! అక్షయ్ కుమార్ అయితే మరింత జోరు మీదున్నాడు. ఆయన గత చిత్రం ‘లక్ష్మీ’. ఆ సినిమా లారెన్స్ తీసిన దక్షిణాది బ్లాక్ బస్టర్ ‘కాంచన’ మూవీయే! అయితే, ఇప్పుడు మరో రెండు కోలీవుడ్ సూపర్ హిట్స్ తో బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు మన రీమేక్స్ ‘ఖిలాడీ’!
అక్షయ్ కుమార్ ప్రస్తుతం చేస్తున్న పలు చిత్రాల్లో ‘బచ్చన్ పాండే’ కూడా ఒకటి. కృతీ సనోన్, జాక్విలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్స్. అయితే, ఈ సినిమా తమిళ హిట్ మూవీ ‘జిగర్తాండ’కి హిందీ రీమేక్ అంటున్నారు. తెలుగులోనూ ’గద్దలకొండ గణేశ్’గా ‘జిగర్తాండ’ రీమేక్ అయిన విషయం మనకు తెలిసిందే.
తమిళంలో, తరువాత తెలుగులో అలరించిన మరో చిత్రం ‘రాట్చసన్’. టాలీవుడ్ లో ‘రాక్షసుడు’గా మంచి టాక్ సంపాదించుకోగలిగింది. అయితే, ఇప్పుడు ఈ కోలీవుడ్ థ్రిల్లర్ మూవీపై అక్షయ్ దృష్టి పడింది. ‘మిషన్ సిండ్రెల్లా’ పేరుతో అక్కీ రీమేక్ చేయనున్నాడట. మరో విశేషం ఏంటంటే… సౌత్ మూవీ ‘రాట్చసన్’ బాలీవుడ్ రీమేక్ లో దక్షిణాది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ కనిపించనుంది. ఆమెకి అక్షయ్ కుమార్ తో ఇదే తొలి చిత్రం అవుతుంది.
‘మిషన్ సిండ్రెల్లా’ షూటింగ్ ఆగస్ట్ లో మొదలవుతుందని కూడా ముంబైలో టాక్ నడుస్తోంది. లండన్ లో సినిమాని షూట్ చేస్తారట. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసే ఓ సైకో కథే ‘సిండ్రెల్లా’ మూవీ. అక్షయ్ కుమార్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడు. చూడాలి మరి, ఖిలాడీ అందించబోతోన్న నెక్ట్స్ టూ సౌత్ రీమేక్స్… ‘బచ్చన్ పాండే’, ‘మిషన్ సిండ్రెల్లా’ ఎలాంటి సక్సెస్ పొందుతాయో!