సినిమాను బిగ్ స్క్రీన్ మీదకు తీసుకు రావాలంటే తెరవెనుక నిర్మాతలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కోట్ల రూపాయలు అప్పులు చేసి, వడ్డీలు కడుతూ సినిమాను పూర్తి చేస్తే.. ఇప్పుడు దాన్ని విడుదల చేసుకోవడానికి హైదరాబాద్‌లోని ప్రాంతీయ సెన్సార్ బోర్డు కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ లేని వింత పోకడలు, అడ్డగోలు నిబంధనలతో తెలుగు సినీ నిర్మాతలకు సెన్సార్ ‘బ్యానర్ ఐడీ’ జారీ ప్రక్రియ ఒక పెద్ద ప్రహసనంగా మారింది.
అసలేంటీ ఐడీ గోల?
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న సినీ నిర్మాణ సంస్థలను క్రమబద్ధీకరించేందుకు 2017లో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రతి నిర్మాత తమ బ్యానర్‌ను ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకుని ఒక ప్రత్యేక ‘ఐడీ’ పొందాలి. ఆ ఐడీ ఉంటేనే సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. దేశంలోని ఇతర ప్రాంతీయ సెన్సార్ కార్యాలయాల్లో ఆధార్, పాన్ కార్డు వంటి ప్రాథమిక పత్రాలు సమర్పిస్తే కేవలం 24 గంటల్లోనే ఈ ఐడీని జారీ చేస్తున్నారు. కానీ, అత్యధికంగా సినిమాలు నిర్మించే టాలీవుడ్లో మాత్రం ఈ ఐడీ రావడానికి వారాలు, నెలల తరబడి సమయం పడుతోంది.
వింత సాకులుతో అధికారుల కక్షసాధింపు!
ఈ వ్యవహారంలో నిర్మాతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి: ఐడీ జారీ చేయకపోవడానికి సెన్సార్ ఆఫీసు చెబుతున్న కారణాలు అత్యంత హాస్యాస్పదంగా ఉంటున్నాయి. ఒక నిర్మాతకు ఏకంగా “ఆధార్ కార్డులో ఫోటో సరిగ్గా లేదు” అనే సాకుతో ఐడీ నిరాకరించారు. మరో నిర్మాత విషయంలో, దరఖాస్తు కోసం రీసెంట్గా తీయించుకున్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కాకుండా, పాత ఫోటో తీసుకురమ్మని మెలిక పెట్టారు. అసలు ఇలాంటి నిబంధనలు దేశంలో ఎక్కడైనా ఉంటాయా అని నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో సాధారణ పత్రాలతో పని అయిపోతుంటే, హైదరాబాద్ ఆఫీసులో మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా అదనంగా ఒక ‘అఫిడవిట్’ జత చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. హైదరాబాద్‌లో జాప్యం భరించలేక, నిబంధనల ప్రకారం వెసులుబాటు ఉండటంతో కొందరు నిర్మాతలు ఇతర రాష్ట్రాల సెన్సార్ ఆఫీసుల్లో ఐడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆ ఫైళ్లు తిరిగి హైదరాబాద్ ఆఫీసుకే రావడంతో, “మమ్మల్ని కాదని వేరే చోట దరఖాస్తు చేస్తారా?” అనే కోపంతో అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఆ ఐడీలను మరింత ఆలస్యం చేస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తవారికే కాదు, టాలీవుడ్లో నాలుగైదు దశాబ్దాలుగా సినిమాలు తీస్తున్న సీనియర్ నిర్మాతలకు, బడా ప్రొడ్యూసర్లకు కూడా ఇవే చుక్కలు చూపిస్తున్నారు. ఇటీవల ఒక అగ్ర నిర్మాత ఐడీ కోసం దరఖాస్తు చేస్తే, ఆయనను ఏకంగా రెండు నెలల పాటు ఆఫీసు చుట్టూ తిప్పించుకున్న తర్వాతే ఐడీ ఇచ్చారు.
అసలు సమస్య ఎక్కడ?
గత ఏడాది ఫిబ్రవరి నుంచి హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ కార్యాలయానికి పూర్తిస్థాయి రీజినల్ ఆఫీసర్ (RO) లేరు. దూరదర్శన్‌లో డైరెక్టర్ హోదాలో ఉన్న డాక్టర్ రాహుల్ గౌలికర్కు ఇన్‌ఛార్జి ఆర్ఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఈ కొత్త నిబంధనల పేరిట వేధింపులు మొదలయ్యాయని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. కనీసం తమ సమస్యలు చెప్పుకుందామంటే ఇన్‌ఛార్జి ఆర్ఓ అపాయింట్మెంట్ కూడా ఇవ్వరని, ఫోన్లో కూడా అందుబాటులో ఉండరని వాపోతున్నారు. ఐడీ ఎప్పుడు వస్తుందో తెలియక, సినిమా రిలీజ్లు ఆగిపోయి, తెచ్చిన అప్పులకు వడ్డీలు తడిసిమోపెడవుతున్నాయని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సమస్యపై ఫిల్మ్ ఛాంబర్ ద్వారా సెన్సార్ బోర్డుకు లేఖ రాసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. అయితే, సెంట్రల్ సెన్సార్ బోర్డు ఛైర్మన్ వెంపటి శశికుమార్ తెలుగువారే కావడంతో, నిర్మాతల మండలి ఈ విషయాన్ని నేరుగా ఆయన దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే హైదరాబాద్ కార్యాలయానికి పూర్తిస్థాయి ఆర్ఓను నియమిస్తే తప్ప ఈ అరాచకానికి తెరపడదని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

