Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్‌లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?

Huma Qureshi

Huma Qureshi

Huma Qureshi: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’పై భారీ అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న హీరోయిన్ హ్యూమా ఖురేషీ.. చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. తనపై, ‘టాక్సిక్’ టీమ్‌పై చూపిస్తున్న ప్రేమ, ఆదరణను చూసేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా హ్యూమా ఖురేషీ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రేమ, రెస్పాన్స్ ప్రత్యక్షంగా చూడటానికి రావాల్సిందే అనిపించింది. ‘టాక్సిక్’ టీమ్ తరఫున అందరికీ థాంక్యూ. మా దర్శకురాలు గీతు మోహన్‌దాస్ ఇక్కడ లేకపోవడం బాధగా ఉంది. ప్రస్తుతం సినిమా పనులకు సంబంధించిన ముఖ్యమైన బాధ్యతలతో ఆమె బిజీగా ఉన్నారు’’ అని చెప్పారు. గీతు మోహన్‌దాస్ తనను ఈ పాత్ర కోసం సంప్రదించినప్పుడు.. తాను ఒక చరిత్రలో భాగం కాబోతున్నానని అప్పుడు తెలియదని హ్యూమా తెలిపారు. ‘‘ఈ సినిమాలో భాగం కావడం నిజంగా అద్భుతమైన అనుభవం. యశ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సినిమాను మార్చాలనే విజన్, ధైర్యం ఆయనకు ఉన్నాయి. ‘టాక్సిక్’ చాలా కాలం గుర్తుండిపోయే సినిమా అవుతుందని నమ్ముతున్నాను’’ అని అన్నారు.

తన ఎలిజబెత్ పాత్ర గురించి ఎక్కువ విషయాలు చెప్పలేనని హ్యూమా ఖురేషీ అన్నారు. ట్రైలర్‌లో కనిపించని ఎన్నో అంశాలు సినిమాలో ఉన్నాయని, తన పాత్ర గురించి ఎక్కువగా చెప్పకపోవడానికి కారణం కూడా అదే అని తెలిపారు. ‘‘నేను సినిమాలో చిన్న భాగమే. కానీ కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు మేమేం సృష్టించామో నాకే నమ్మశక్యంగా అనిపించలేదు. అసలు అనుభవం కోసం థియేటర్లలో సినిమా చూడాల్సిందే’’ అని పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకుల రెస్పాన్స్‌పై హ్యూమా ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌కు వచ్చి ఇంతటి ప్రేమను అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వెండి తెరపై చూడాల్సిన అనుభవమే ‘టాక్సిక్’ అని, తెలుగు ప్రేక్షకులు సినిమాను తప్పకుండా ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా హ్యూమా ఖురేషీ మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘‘నేను ఇప్పటివరకు తెలుగు సినిమా చేయలేదని బాధగా ఉంది. కానీ ఇక దాన్ని మార్చాలి. చాలా త్వరలోనే తెలుగు సినిమాలో కనిపిస్తాను’’ అని ప్రకటించారు. దీంతో హ్యూమా ఖురేషీ త్వరలోనే నేరుగా తెలుగు సినిమాలో నటించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.