కరోనా పేద, గొప్ప, మధ్యతరగతి అంటూ భేదాలు చూపటం లేదు. అందర్నీ కాటేస్తోంది. అదృష్టవశాత్తూ అత్యధిక కరోనా రోగులు మామూలుగానే తేరుకుంటున్నారు. కానీ, కొందరు మాత్రం ఆసుపత్రి పాలై లక్షలు చెల్లించాల్సి వస్తోంది. అటువంటి ఆందోళనక స్థితే ‘పెళ్లికి ముందు ప్రేమ’ సినిమా నిర్మాతకి ఇప్పుడు ఎదురవుతోందట. ఆయన పేరు అవినాశ్. నెల రోజులుగా మహమ్మారితో పోరాడుతూ హాస్పిటల్ లో ఉన్నాడు. ఆరోగ్య సమస్యతో పాటూ ఆర్దిక సమస్య అతడ్ని తీవ్రంగా వేధిస్తోంది.
సినీ నిర్మాత అవినాశ్ పరిస్థితిని హీరోయిన్ సునయన తన సొషల్ మీడియా అకౌంట్ ద్వారా నెటిజన్స్ కి తెలిపింది. గతంలో ఎప్పుడూ తాను ఎలాంటి ఫండ్ రైజర్స్ నిర్వహించలేదని చెప్పిన ఆమె తొలిసారి నిర్మాత అవినాశ్ కోసం విరాళాలు సేకరిస్తున్నానని వివరించింది. స్వయంగా కరోనా బారిన పడి బయటపడ్డ తనకు ఆ శారీరిక, మానసిక ఒత్తిడి ఎలా ఉంటుందో తెలుసునని సునయన తెలిపింది. అందుకే, ప్రస్తుతం హాస్పిటల్ బెడ్ పై ఉన్న నిర్మాత కోసం ఎవరికి తోచిన సాయం వారు చేయండని ఆమె అభ్యర్థించింది. ఎంత చిన్న మొత్తం అయినా విరాళంగా అందించమని కోరింది.
సునయన తెలుగులో సినిమాలు చేసినప్పటికీ ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉంది. అక్కడ రెండు, మూడు సినిమాలతో కెరీర్ ను గాడిలో పెట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. ఆమె ఆందోళన వ్యక్తం చేస్తూ ఫండ్ రైజర్ ఏర్పాటు చేసిన సినీ నిర్మాత అవినాశ్ త్వరగా కోలుకోవాలని మనమూ ఆ భగవంతుడ్ని వేడుకుందాం.