అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (మోటివ్ ఫర్ మర్డర్). ఈ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ జో శర్మ.. M4M చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో ఆమె రాధ అనే పవర్‌ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రను పోషించారు. కేవలం నటిగానే కాకుండా.. దర్శకుడు మోహన్ వడ్లపట్ల, రాహుల్ అడవలలతో కలిసి ఈ చిత్రానికి కో-రైటర్‌గా కూడా పని చేయడం విశేషం. సినిమా రిలీజ్ సందర్భంగా జో శర్మ చిత్ర విశేషాలు, ఆమె సినీ ప్రయాణం గురించిన వివరాలు పంచుకున్నారు.
M4M సినిమా రిలీజ్ కాకముందే అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. లాస్ ఏంజెల్స్, లండన్, న్యూయార్క్, హాలీవుడ్ వంటి ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్‌లో ఏకంగా 15 అవార్డులను గెలుచుకుంది. ముఖ్యంగా ‘కేన్స్’ ఫిలిం ఫెస్టివల్‌లో గ్లోబల్ ప్రీమియర్ వేసినప్పుడు విదేశీ ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం చిత్ర బృందానికి పెద్ద బూస్ట్‌ను ఇచ్చింది. జో శర్మ ఉత్తమ నటిగా, మోహన్ వడ్లపట్ల ఉత్తమ దర్శకుడిగా పలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
M4M ఒక విభిన్నమైన సీరియల్ కిల్లర్ స్టోరీ అని జో శర్మ చెప్పారు. హంతకుడు హత్యలు చేసిన తర్వాత మృతదేహాలను రాజా రవివర్మ, పికాసో వంటి సుప్రసిద్ధ చిత్రకారుల కళాఖండాల తరహాలో అలంకరించడం ఈ కథలోని ప్రధాన సస్పెన్స్ అని తెలిపారు. ప్రపంచ సినిమా చరిత్రలోనే ఇలాంటి కాన్సెప్ట్ రాలేదని ధీమా వ్యక్తం చేశారు. సినిమా చూసే ప్రేక్షకులకు ఒక ఆసక్తికరమైన ఛాలెంజ్ కూడా జో శర్మ విసిరారు. విడుదల రోజున విలన్ ఎవరో గుర్తించిన వారికి లక్ష రూపాయల బహుమతి ప్రకటించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
జో శర్మ హైదరాబాద్‌లో జన్మించి.. నాగ్‌పూర్, ముంబైలలో పెరిగారు. ఆమె మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఉండటంతో.. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ భాషల్లో పట్టు ఉంది. మోహన్ మీడియా క్రియేషన్స్, మెక్ క్వీన్ గ్రూప్ అమెరికా వారు సంయుక్తంగా సుమారు ఒక లక్ష డాలర్ల బడ్జెట్‌తో M4Mను నిర్మించారు. షూటింగ్ ప్రధానంగా హైదరాబాద్ పరిసరాల్లో జరిగింది. చెన్నైకి చెందిన వసంత్ ఇసైపట్టాయ్ స్వరాలు అందించారు. పీవీఆర్ ఇనాక్స్ పిక్చర్స్ ద్వారా విడుదలవుతున్న ఈ చిత్రం మే 8న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
